సర్పంచ్‌లపై గురుతర బాధ్యత

Jul 23 2021 @ 01:07AM

సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు అందించాలి

శిక్షణా తరగతుల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఇబ్రహీంపట్నం, జూలై 22 : గ్రామ పరిపాలనలో సర్పంచ్‌ల పనితీరే కీలకమైందని ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేసే గురుతర బాధ్యత వారిపై ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నిమ్రా ఇంజనీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో గురువారం విజయవాడ డివిజన్‌ పరిధిలోని సర్పంచ్‌లకు గ్రామ పంచాయతీ పరిపాలనపై శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పాలనపై అవగహన కోసమే సర్పంచ్‌లకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామన్నారు. సచివాలయ వ్యవస్థకు సర్పంచ్‌లే రథసారథులన్నారు. సర్పంచ్‌ల ద్వారా 750 రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి 100 రోజుల పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం నిర్వహిస్తామన్నారు. కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో 4 దశలుగా 778 గ్రామ సర్పంచ్‌లకు మూడేసి రోజుల పాటు 14 అంశాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి అవగాహన కలిగి పారదర్శకంగా వాటిని అమలు చేసేందుకు సర్పంచ్‌లు కృతనిచ్చయులు కావాలన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌, గ్రామీణాభివృద్ధిశాఖ (ఎస్‌ఐఆర్‌డీ) డైరెక్టర్‌ జె.మురళీ మాట్లాడారు. ఈకార్యక్రమంలో జెడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు, డీపీవో జ్యోతి, తహసీల్దార్‌ సూర్యారావు, డీఎల్‌పీవో చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.