చంద్రబాబును ఎలాగైనా దెబ్బతీయాలని పెద్దిరెడ్డి ప్లాన్.. సీన్ రివర్స్!?

ABN , First Publish Date - 2021-01-23T17:07:07+05:30 IST

మంత్రి పర్యటనలో పోటాపోటీ సభలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది?..

చంద్రబాబును ఎలాగైనా దెబ్బతీయాలని పెద్దిరెడ్డి ప్లాన్.. సీన్ రివర్స్!?

ఆ నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు అంతకంతకు శ్రుతిమించుతోందా? మంత్రి పర్యటనలో పోటాపోటీ సభలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? ఆ వర్గాలన్నింటినీ సంతృప్తి పరచడానికి మధ్యే మార్గంగా మంత్రి ఎలాంటి వ్యూహం అమలు చేశారు? ఆ మంత్రి అవస్థను గమనించిన డిప్యూటీ సీఎం ఎలాంటి హితోక్తులు పలికారు? మంత్రి పర్యటనలో భగ్గుమన్న వర్గ విభేదాలు ఆ పార్టీలో ఎవరిని గుబులు పుట్టిస్తోంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే.


వైసీపీకి కష్టమే..

చిత్తూరు జిల్లా కుప్పంలో పాగా వేయాలని అధికార వైసీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబును ఎలాగైనా దెబ్బతీయాలని..మంత్రి పెద్దిరెడ్డి స్థానికంగా జరుగుతున్న పరిణామాలను రాజకీయంగా ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. అందుకే రకరకాల కార్యక్రమాల పేరుతో తరుచూ పెద్దిరెడ్డి కుప్పంలో పర్యటిస్తున్నట్లు చెబుతారు. టీడీపీకి కంచుకోట అయిన కుప్పంలో చంద్రబాబును ఓడించడం ఆషామాషీ కాదని వైసీపీ నాయకులకు తెలుసు. కుప్పంలో పాతుకుపోయిన టీడీపీని కాదని మున్సిపాలిటీని గెలిపించుకోవడం వైసీపీకి కష్టమే అని ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయట. అయితే వైసీపీలో కొనసాగుతున్న వర్గ విభేదాలు ఆ పార్టీని మరింత దెబ్బతీసేలా ఉందన్న ఆందోళన వారిని వెంటాడుతుందట.


బయటపడ్డ కుమ్ములాటలు! 

కుప్పం నియోజకవర్గంలో నవరత్నాల విజయోత్సవ సభలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి,చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప సహా జిల్లాకు చెందిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పోటాపోటీ సభలు నిర్వహించడంతో ఆ పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న కుమ్ములాటలు బయటపడ్డాయి. కుప్పం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భరత్‌ను, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్‌ను బహిరంగసభలో మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. దాంతో ఆయా స్థానాల్లో అభ్యర్థిత్వాలపై ఇటీవల నెలకొన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోయాయి.


ఓకే చెప్పారట..

అయితే మంత్రి కుప్పం పర్యటన సందర్భంగా..వేర్వేరుగా నవరత్నాల విజయోత్సవ సభలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ కూడలితో పాటు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో సభలు జరిగాయి. స్థానిక నాయకులు తొలుత మార్కెట్ యార్డ్‌లోనే సభ అనుకున్నారు. కానీ అక్కడ అయితే జనం పెద్దగా రాకపోవచ్చన్న కారణంతో రెస్కో ఛైర్మెన్  సెంథిల్ ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో బహిరంగ సభ ఏర్పాటుకు పట్టుపట్టారట. నియోజకవర్గంలో తన ప్రధాన అనుచరుడు కావడంతో ఆయన మాటను మంత్రి పెద్దిరెడ్డి కాదనలేకపోయారట. మరోవైపు వైసిపి మండల కన్వీనర్ హెచ్ ఎం మురుగేష్ ఆధ్వర్యంలో...పార్టీలోని వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మార్కెట్ యార్డ్‌లో సైతం సభ జరిపి తీరాలని భీష్మించారట. నియోజకవర్గంలో అధిక సంఖ్యాక సామాజికవర్గం కావడంతో వన్నెకుల క్షత్రియ నాయకుల మాటకు మంత్రి ఓకే చెప్పారట.


అభ్యర్థుల్లో కలవరం..

ఇక ఆర్టీసీ బస్టాండ్ కూడలి సభలో తనకు అందరూ సమానులే అన్న మంత్రి పెద్దిరెడ్డి.. రెస్కో చైర్మన్ సెంథిల్ తనకు మరింత ఎక్కువ సమానుడని ప్రకటించడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసినట్లు తెలుస్తోంది. వన్నెకుల క్షత్రియులను సంతృప్తిపరచడానికే మార్కెట్‌ యార్డ్‌లో నిర్వహించిన సభకు మంత్రి పెద్దరెడ్డి వెళ్లినట్లు సమాచారం. అంతేకాదు సెంథిల్‌కు వ్యతిరేక వర్గంగా ప్రచారంలో ఉన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ నూతన గృహప్రవేశానికి మంత్రి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. ఇలా కుప్పం వైసీపీలో వర్గాలన్నింటినీ సంతృప్తిపరచడానికి మంత్రి పెద్దిరెడ్డి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే పెద్దిరెడ్డి అవస్థ గమనించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుప్పం సభలో గొడవలు వద్దు అందరూ కలిసి పనిచేయాలన్నారు. మరోవైపు పోటా పోటీ సభలు నిర్వహించడంతో ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థుల్లో కలవరం రేగుతుందట.


పాచికలు పారేనా..!?

వర్గ విభేదాలు మాని తమ గెలుపు కోసం పార్టీ నాయకులు కలిసి కట్టుగా పనిచేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. కుప్పంలో చంద్రబాబుపై పై చేయి సాధించాలనీ..ఇతర పార్టీల నాయకులను లాగుతూ బలపడాలనుకుంటున్న వైసీపీ..సొంత పార్టీని చక్కబెట్టుకోలేకపోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా రాజకీయ చాణుక్యుడిగా పేరొందిన చంద్రబాబు నియోజకవర్గంలో వైసీపీ పాచికలు పారుతాయో లేదో చూడాలి.

Updated Date - 2021-01-23T17:07:07+05:30 IST