మంత్రి సబితారెడ్డి ఆగ్రహం.. సెలవులో అధికారి.. కొసమెరుపు ఏంటంటే..?

Jun 10 2021 @ 08:43AM

  • ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో ఇష్టారాజ్యం


హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్‌ : మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఓ ఏజెన్సీ నుంచి పర్సంటేజీ అడిగిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.  కార్పొరేషన్‌లలో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యతను నిర్ధారించడానికిగాను ప్రత్యేకంగా ‘థర్డ్‌ పార్టీ ఏజెన్సీ’(క్వాలిటీ కంట్రోల్‌-క్యూసీ)ని నియమించుకోవాల్సి ఉంటుంది. సదరు ఏజెన్సీకి చెందిన ప్రతినిధులు ప్రతి అభివృద్ధి పని నుంచి నమూనాలు సేకరించి, నగరంలోని ల్యాబ్‌లో పరీక్షలు జరిపి, పనిలో నాణ్యత ఉందా..? లోపించిందా..? అనేది నిర్ధారిస్తారు. దాని ప్రకారమే కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరవుతుంది. మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో గతంలో నియమించుకున్న క్యూసీ ఏజెన్సీ కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్నట్టు సమాచారం. దాంతో కొత్తగా ఏజెన్సీని నియమించుకోవడానికిగాను ఈవోఐ(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌- ఇది కూడా ఒక రకంగా టెండర్‌లాంటిదే) పిలువగా నాలుగు ఏజెన్సీల నుంచి అప్లికేషన్లు వచ్చినట్టు తెలిసింది.

కాగా.. వారిలో ఓ ఏజెన్సీ ప్రతినిధులు తమకే ఈవోఐ దక్కేలా చూడాలంటూ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఓ అధికారిని సంప్రదించగా, ఆయన వారి నుంచి ‘పర్సంటేజీ’ డిమాండ్‌ చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం మంత్రి సబితారెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆమె సదరు అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాంతో ఆయన వారం రోజుల నుంచి సెలవుపై వెళ్లిపోగా, ఆయన స్థానంలో ఆదిభట్ల మునిసిపాలిటీకి చెందిన అధికారికి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇది మీర్‌పేట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక్కడి ఇంజనీరింగ్‌ సెక్షన్‌లో చోటుచేసుకుంటున్న అవినీతి భాగోతానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమేనని, ఇక్కడ ప్రతి పనికీ ఓ నిర్ణీత ‘రేటు’ ప్రకారం పర్సంటేజీ చెల్లించుకుంటేనే ఫైల్‌ కదులుతుందనే ప్రచారం జరుగుతోంది. 


ఈ పర్సంటేజీలు కేవలం ఇంజనీరింగ్‌ సెక్షన్‌కే పరిమితం కాకుండా, ఇతర అధికారులకు, కొందరు ప్రజా ప్రతినిధులకు సైతం చేరుతున్నాయనే గుసగుసలు వినవస్తున్నాయి. ఆ లెక్కన ఇక్కడ రూ.కోట్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఏ మేర అవినీతి జరుగుతుందో.. ఎంత ప్రజాధనం ఇతరుల జేబుల్లోకి చేరుతుందో ఊహించుకోవచ్చు. ఈ పర్సంటేజీల కారణంగా కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత సైతం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ముందు జరిగే పనులైనా నాణ్యతగా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 


కొసమెరుపు 

క్వాలిటీ కంట్రోల్‌ ఏజెన్సీ నుంచే అధికారులు పర్సంటేజీ డిమాండ్‌ చేస్తే.. ఇక ఆ ఏజెన్సీ చేసే పనిలో ‘క్వాలిటీ’ ఏ మేరకు ఉంటుందో అన్నది ఇక్కడ కొసమెరుపు..!

Follow Us on: