గ్రామాల్లో కోవిడ్ నివారణ, చికిత్సపై అవగాహన కల్పించాలి: మంత్రి సత్యవతి

May 7 2021 @ 14:38PM

హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు కరోనా వ్యాప్తి, నివారణ, చికిత్సలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పరిస్థితులను ఆయా జిల్లా కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే జరుగుతున్న నేపథ్యంలో జ్వరం ఉన్నట్లు తేలితే, వెంటనే వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందించాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన మందులు, వైద్య సిబ్బంది, బెడ్స్ కొరత లేకుండా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ నివేదికలు రూపొందించి పంపించాలని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, చైతన్యం కల్పించాలని, కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, కర్ఫ్యూ సమయంలో ఎవరు బయటికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


కోవిడ్ పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని, వారిని భాగస్వామ్యం చేయాలని సూచించారు.కరోనా బారిన పడి ఇంట్లో ఎవరూ లేని ఆ తల్లిదండ్రుల పిల్లల సంరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చైల్డ్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా తల్లిదండ్రులకు కరోనా వచ్చి పిల్లలు ఒంటరిగా ఉండే పరిస్థితి వస్తే, వారిని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోమ్స్ లలో పెట్టీ అవసరమైన వసతులను కల్పించి సంరక్షించాలని చెప్పారు. జిల్లాలో కరోనా బారిన పడ్డ తల్లిదండ్రుల పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి  ట్రాన్సిట్ హోమ్ కు తీసుకురావడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో వెంటనే ఉత్తర్వులు అమలు చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు.కోవిడ్ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే 24 గంటలు తాను అందుబాటులో ఉంటానని, వెంటనే సమస్యను తన దృష్టికి తీసుకురావాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.