నాలాల సమగ్ర అభివృద్ధితో వరద ముంపు సమస్య దూరం:Talasani

ABN , First Publish Date - 2022-05-11T20:47:44+05:30 IST

నాలాల సమగ్ర అభివృద్ధి తో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) అన్నారు.

నాలాల సమగ్ర అభివృద్ధితో వరద ముంపు సమస్య దూరం:Talasani

హైదరాబాద్: నాలాల సమగ్ర అభివృద్ధి తో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) అన్నారు. రూ.45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేట లోని నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి నేడు పరిశీలించారు, మయూర్ మార్గ్, బ్రాహ్మణవాడి లలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. SNDP, GHMC, ఎలెక్ట్రికల్, టౌన్ ప్లానింగ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పనులను వేగవంతం చేయాలని  ఆదేశించారు. నాలాను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీడిమెట్ల, బాలానగర్, పతే నగర్ ల మీదుగా ఉన్న బేగంపేట నాలాకు ఎగువ నుండి వచ్చే వరదముంపు సమస్యను పరిష్కరించేందుకు గాను బ్రాహ్మణవాడి, మయూర్ మార్గ్ మరియు ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్లోని కూకట్పల్లి నాలాపై రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, నీటి సరఫరా మరియు మురుగునీటి లైన్లను పునరుద్దరించడం, నాలా వెంట రహదారులను VDCCతో అభివృద్ధి చేయడం వంటి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. 


బ్రాహ్మణవాడి మరియు ప్రకాష్ నగర్ ప్రాంతాలలో గ్యాప్ పోర్షన్లలో కొత్త రిటైనింగ్ వాల్ల నిర్మాణం మరియు ఇప్పటికే ఉన్న రిటైనింగ్ గోడల ఎత్తును పెంచడం జరుగుతుందని వివరించారు. 8 నెలల్లో ఈ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఎగువ నుండి వచ్చే వరదనీటితో నాలాల పరిసర ప్రాంతాలు, కాలనీలు వరదముంపుకు గురవుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. నగరంలోని అనేక నాలాల పరిధిలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పారు. వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను మున్సిపల్ శాఖ మంత్రి కేసీఆర్ చొరవతో నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం (SNDP) చేపట్టడం జరిగిందని తెలిపారు. నాలాల పూర్తిస్థాయి అభివృద్ధి పనులకోసం 108 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే ప్యాట్నీ నాలా పై వంతెన నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. 


హుస్సేన్ సాగర్ నుండి ముషీరాబాద్, అంబర్ పేట మీదుగా మూసీ నదిలో కలిసే వరకు ఉన్న నాలాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు.నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నదని వివరించారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ నాలాల అభివృద్దికి గురించి గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. వరదలు వచ్చిన సమయంలో మాత్రమే వచ్చి వెళ్ళేవారని, సమస్య ను పరిష్కరించాలనే ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. అప్పటి జనాభా కు అనుగుణంగా నిర్మించిన నాలాలు పెరిగిన ప్రస్తుత జనాభా కు అనుగుణంగా లేకపోవడం, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు గురైన కారణంగా అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. SNDP కార్యక్రమంతో ఈవరదముంపు  సమస్య పూర్తిగా పరిష్కారం అవుతాయని చెప్పారు. 

Read more