వారంలోగా పది లక్షల మందికి బూస్టర్‌ డోస్‌

ABN , First Publish Date - 2022-01-21T13:34:04+05:30 IST

అర్హత ఉన్న, రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేసుకున్న సుమారు పదిలక్షల మందికి ఈ వారంలోగా బూస్టర్‌ డోస్‌ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక పూందమల్లి

వారంలోగా పది లక్షల మందికి బూస్టర్‌ డోస్‌

                   - ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం 


చెన్నై: అర్హత ఉన్న, రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేసుకున్న సుమారు పదిలక్షల మందికి ఈ వారంలోగా బూస్టర్‌ డోస్‌ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక పూందమల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు తదితర ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌ డోస్‌ వేసే కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఆయన పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బూస్టర్‌ డోస్‌ టీకాలు వేసు కునేందుకు ఇప్పటివరకూ 5.32 లక్షలమందికి అర్హత ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరందరికీ బూస్టర్‌ డోస్‌ టీకాలు వీలయినంత త్వరగా వేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ వారంలోగా పది లక్షల మందికి బూస్టర్‌ డోస్‌ టీకాలు వేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో  కొవాక్సిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు వేసే మెగా శిబిరాలకు అపూర్వ స్పందన లభిస్తున్నదని, ప్రతి మెగా శిబిరంలోనూ 15 నుంచి 20 లక్షల మంది వరకూ టీకాలు వేయాలని నిర్ణయించినట్లు మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.


బూస్టర్‌ డోస్‌ మెగా శిబిరం ప్రారంభం...

ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉదయం బూస్టర్‌ డోస్‌ మెగా శిబిరాలు ప్రారంభమయ్యాయి. రాజధాని నగరం చెన్నైలో 160 ప్రాంతాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 చోట్ల బూస్టర్‌ డోస్‌ శిబిరాలు నిర్వహించారు. ముఖ్యంగా అరవైయేళ్లకు పైబడి రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేసుకున్నవారు అధిక సంఖ్యలో శిబిరాలకు వెళ్ళి బూస్టర్‌ డోస్‌ వేసుకుంటున్నారు. పలు చోట్ల ఆరోగ్య కార్యకర్తలు, సహాయకులు వృద్ధులను ఇళ్ల నుంచి వాహనాల్లో తీసుకువచ్చి టీకా వేయించి మళ్ళీ వారిని ఇళ్ల వద్ద దింపారు. ఇకపై ప్రతి గురువారం బూస్టర్‌ డోస్‌ టీకాల శిబిరాలు ఇదే విధంగా ప్రతి గురువారం నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-01-21T13:34:04+05:30 IST