త్వరలో 10 కోట్ల వ్యాక్సిన్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2022-02-10T14:56:24+05:30 IST

రాష్ట్రంలో ఇప్పటి వరకూ తొమ్మిది కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌ వేశామని, త్వరలో పదికోట్ల వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని అధిగమించనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. బుధవారం ఉదయం ఆయన గిండి

త్వరలో 10 కోట్ల వ్యాక్సిన్‌ లక్ష్యం

చెన్నై: రాష్ట్రంలో ఇప్పటి వరకూ తొమ్మిది కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌ వేశామని, త్వరలో పదికోట్ల వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని అధిగమించనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. బుధవారం ఉదయం ఆయన గిండి కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సమీపంలో కరోనా ప్రత్యేక ఆస్పత్రిని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జె.రాధాకృష్ణన్‌తో కలిసి పరిశీలించారు. ఆ ఆస్పత్రిలోని కరోనా ప్రత్యేక వార్డులను సందర్శించారు. కరోనా బాధితులకు లభిస్తున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు శాతం కరోనా బాధితులు మాత్రమే వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇదే విధంగా ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతున్నవారు ఏడు శాతం వరకూ ఉన్నారని, గురువారం బూస్టర్‌ టీకాల శిబిరాలు నిర్వహించనున్నామని, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 22వ విడత వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేపడుతున్నామని వెల్లడించారు.. 


నీట్‌ బిల్లును గవర్నర్‌ తిరస్కరించలేరు...

శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించిన నీట్‌ మినహాయింపు బిల్లును గరవ్నర్‌ తిప్పిపంపలేరని మంత్రి పేర్కొన్నారు. గత బిల్లుకు మరిన్ని మార్పులు, చేర్పులతో రూపొందించామని చెప్పారు. ఈ తాజా బిల్లును సమగ్రంగా పరిశీలించిన మీదట గవర్నర్‌ దానిని రాష్ట్రపతి ఆమోదానికి తప్పకుండా పంపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదేళ్లకు ముందు రాష్ట్రానికి నీట్‌ అనవసరమంటూ ప్రైవేటు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై చెప్పారని, ప్రస్తుతం నీట్‌ అత్యంత అవసరమని చెబుతుండటం విడ్డూరంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-02-10T14:56:24+05:30 IST