Madhurai డీన్‌ బదిలీ ఉత్తర్వుల రద్దు

ABN , First Publish Date - 2022-05-05T15:23:31+05:30 IST

మదురై ప్రభుత్వ వైద్యకళాశాల డీన్‌ రత్నవేల్‌ బదిలీ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం శాసనసభలో ప్రకటించారు. గత శనివారంమదురై ప్రభుత్వ వైద్యకళాశాలలో జరిగిన

Madhurai డీన్‌ బదిలీ ఉత్తర్వుల రద్దు

                            - మంత్రి సుబ్రమణ్యం ప్రకటన


చెన్నై: మదురై ప్రభుత్వ వైద్యకళాశాల డీన్‌ రత్నవేల్‌ బదిలీ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం శాసనసభలో ప్రకటించారు. గత శనివారంమదురై ప్రభుత్వ వైద్యకళాశాలలో జరిగిన మొదటి సంవత్సరం వైద్యవిద్యార్థుల స్వాగత కార్యక్రమంలో మంత్రులు మూర్తి, పళనివేల్‌ త్యాగరాజన్‌ పాల్గొన్నారు. ఆ సందర్భంగా కాబో యే వైద్యులుగా నైతికవిలువలు పాటించి రోగులకు సేవలందిస్తామంటూ ఆంగ్లంలో ‘హిప్పోక్రాటిక్‌’ ప్రతిజ్ఞ చేయించటానికి బదులుగా సంస్కృతంలో ‘మహర్షి చరక సంహిత’ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సంఘటనపై సభలో పాల్గొన్న మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యవిద్యార్థులతో సంస్కృతంలో ప్రతిజ్ఞ చేయించడంపై పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో మదురై వైద్యకళాశాల డీన్‌ రత్నవేల్‌ను బదిలీ చేయడంతో పాటు వేకెన్సీ రిజర్వులో పెడుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపై వైద్యకళాశాలల్లో ఆంగ్లంలో హిప్పోక్రాటిక్‌ ప్రతిజ్ఞ మాత్ర మే చేయించాలంటూ అన్ని కళాశాలలకు సర్క్యులర్‌ కూడా జారీ అయ్యింది. అయితే పొరపాటున సంస్కృతంలో ప్రతిజ్ఞ చేయించడం తప్పిదం కాదని, అనవసరంగా డీన్‌ను బదిలీ చేయడం తగదని రాష్ట్ర వైద్యుల సంఘం పేర్కొంది. అదే సమయంలో వైద్య విద్యామండలి సంచాలకులు డాక్టర్‌ నారాయణబాబు మదురై వైద్యకళాశాలకు వెళ్ళి విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం శాసనసభలో ఈ వివాదంపై ప్రస్తావన రాగా ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. మదురై వైద్యకళాశాల డీన్‌ బదిలీ ఉత్తర్వులను రద్దు చేసి ఆయనను ఆ కళాశాలలోనే పనిచేయడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.

Read more