అంబేడ్కర్‌ భావజాలంతో విద్యా కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-11-27T06:01:20+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భావజాలం, ఆలోచనా విధానానికి అనుగుణంగా తమ ప్రభుత్వం విద్యా రంగంలో కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

అంబేడ్కర్‌ భావజాలంతో విద్యా కార్యక్రమాలు
రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, హోం మంత్రి సుచరిత

విద్యార్థి దశ నుంచే పుస్తకాలు, పత్రికలు చదవాలి

‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సురేష్‌

గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భావజాలం, ఆలోచనా విధానానికి అనుగుణంగా తమ ప్రభుత్వం విద్యా రంగంలో కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞని చేయించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించడం కోసమే ఈ కార్యక్రమం అమలులోకి తీసుకువచ్చామన్నారు. ఇంగ్లీషు, తెలుగు రీడింగ్‌ క్లాసుల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థి దశ నుంచే పుస్తకాలు, కథలు, పత్రికలు, జీవిత చరిత్రలు, విజ్ఞానం పెంపొందించే పుస్తకాలు చదవడంపై అభిరుచి పెంచుకోవాలని సూచించారు. సంక్రాంతి నుంచి నాడు - నేడు రెండో దశ పనులు ప్రారంభమౌతాయన్నారు. ప్రతీ జిల్లాలో టీచర్‌ ట్రైనింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ పుస్తకాలు చదవడంతో విద్యార్థుల్లో సమగ్ర విజ్ఞానం పెంపొందుతుందన్నారు. బడి మానేసే పిల్లల సంఖ్యని తగ్గించేందుకు విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, కంటి వెలుగు, అమ్మఒడి తదితర పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ శాసన, న్యాయ, పరిపాలన, మీడియా వ్యవస్థల ద్వారానే రాజ్యాంగం సక్రమంగా అమలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి బుడితి రాజశేఖర్‌, ఎమ్మెల్సీ డాక్టర్‌ కేఎస్‌ లక్ష్మణరావు, కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు మద్ధాళి గిరిధర్‌, మహమ్మద్‌ ముస్తఫా, పాఠశాల విద్యా స్పెషల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రి సెల్వీ, డైరెక్టర్‌ చినవీరభద్రుడు, జేసీలు  ఏఎస్‌ దినేష్‌కుమార్‌, పీ ప్రశాంతి, పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ పార్వతి, ఆర్‌జేడీ రవీంద్రరెడ్డి, డీఈవో గంగాభవాని, సర్వశిక్ష అభియాన్‌ పీవో వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-27T06:01:20+05:30 IST