పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ చర్యలు: తలసాని

ABN , First Publish Date - 2022-04-09T20:10:42+05:30 IST

పాడి పరిశ్రమ రంగాన్ని మరింత ప్రోత్సహించే విధంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివ్రుద్ది శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ చర్యలు: తలసాని

హైదరాబాద్: పాడి పరిశ్రమ రంగాన్ని మరింత ప్రోత్సహించే విధంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివ్రుద్ది శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో విజయ డెయిరీ ఐస్ క్రీం లను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు 66 నూతన పుష్ కార్ట్ ( ట్రై సైకిల్స్) ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అదేవిధంగా విజయ ఔట్ లెట్ ల నిర్వహకులకు 50 శాతం సబ్సిడీ పై ఫ్రిజ్ లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగ అభివృద్దికి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలు రాష్ట్రంలో ఉత్పత్తి కాకపోవడం వలన ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్ర అవసరాలకు సరిపడ పాలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనానికి అధికారులతో ఒక కమిటీని నియమించినట్లు వివరించారు. 


వ్యవసాయం తర్వాత అత్యధిక కుటుంబాలకు పాడి పరిశ్రమ రంగం జీవనాధారం గా ఉందని చెప్పారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు ఎంతో ప్రజాధరణ ఉందని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు నగరంతో పాటు హైవే లు, పర్యాటక ప్రాంతాలు, ప్రధాన ఆలయాల వద్ద నూతన విక్రయశాలలు ( ఔట్ లెట్) లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విజయ ఉత్పత్తుల విక్రయాల కోసం గతంలో 42 ఈ కార్ట్స్ ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. విజయ డెయిరీ మరో నూతన ఉత్పత్తి విజయ ఐస్ క్రీం లను కూడా ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 250 పుష్ కార్ట్ లను 50 శాతం సభ్సిడీ ప్రారంభించాలని నిర్ణయించడం జరిగిందని, ముందుగా 66 మంది అర్హులకు ఈ పుష్ కార్ట్ లను అందజేసినట్లు తెలిపారు. ఒక్కో పుష్ కార్ట్ విలువ 63,050 రూపాయలు కాగా లభ్దిదారుడి వాటా 31,525, విజయ డెయిరీ వాటా  31,525 రూపాయలుగా ఉందని చెప్పారు. పుష్ కార్ట్ లు, ఈ కార్ట్ ల ద్వారా అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. 


విజయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాల నిర్వహకులకు చేయూతను అందించే ఉద్దేశంతో 200 లీటర్ల సామర్ధ్యం కలిగిన ఫ్రిజ్ లను 50 శాతం సబ్సిడీ పై అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఫ్రిజ్ విలువ 20,932 రూపాయలు కాగా లబ్దిదారుడి వాటా 10,466 రూపాయలు, విజయ డెయిరీ వాటా 10,466 రూపాయలు, పాడి రైతులను ప్రోత్సహించే ఆలోచనతో విజయ డెయిరీ కి పాలు పోసే రైతులకు లీటర్ పాలకు 4 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్న విషయాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ప్రత్యేక చొరవతో ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో మూసివేత దశకు చేరుకున్న విజయ డెయిరీ 750 కోట్ల టర్నోవర్ కు చేరుకుందని పేర్కొన్నారు. వెయ్యి కోట్ల టర్నోవర్ చేరుకోవడమే లక్ష్యంగా మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, డైరెక్టర్ రాంచందర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ విజయా రెడ్డి,  డైరీ అధికారులు మల్లిఖార్జున్, మల్లయ్య, అరుణ్, కామేష్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-09T20:10:42+05:30 IST