school విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం:Talasani

ABN , First Publish Date - 2022-05-20T21:35:09+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) అదేశించారు.

school విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం:Talasani

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) అదేశించారు. శుక్రవారం సనత్ నగర్ నియోజక వర్గం పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ పరిధిలో వున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా ?..., ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?, పాఠాలు మంచిగా చెబుతున్నారా ఈ విధంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్ధులను పలు ప్రశ్నలు వేసి వారి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా 19 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.  పాఠశాలకు చెందిన విద్యార్ధులతో ఈ సందర్భంగా ఆయన ముచ్చటించారు. 


పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాబోధన అందుతున్న తీరు గురించి విద్యార్ధులు, ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరని, 5 తరగతులకు గాను  కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని మంత్రికి వివరించారు. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా ఉపాద్యాయులను నియమించేలా చర్యలు తీసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రోహిణి ని మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా పాఠశాలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, సిబ్బంది కొరత కు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను రూపొందించి అందజేయాలని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం తో పాటు సమగ్రమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు –మనబడి, మన బస్తీ – మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను గుర్తించి 7,289.54 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. 


మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల పనులను 3,497.62 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 499 ప్రాథమిక, 9 ప్రాథమికోన్నత, 182 ఉన్నత పాఠశాలల ను కలుపుకొని 690 పాఠశాలలు ఉండగా, హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 239 పాఠశాలలను అభివృద్ధి పనులు చేపట్టేందుకు మొదటి దశలో ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వ విద్యపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. 

Updated Date - 2022-05-20T21:35:09+05:30 IST