నట్టల నివారణ మందుల పంపిణీ ప్రారంభించిన మంత్రి Talasani

ABN , First Publish Date - 2022-06-04T23:25:55+05:30 IST

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) అన్ని వృత్తుల వారికి ఆర్థిక సాయం ఇస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) అన్నారు.

నట్టల నివారణ మందుల పంపిణీ ప్రారంభించిన మంత్రి Talasani

కామారెడ్డి: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) అన్ని వృత్తుల వారికి ఆర్థిక సాయం ఇస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో రాయితీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న కులవృత్తులను ప్రోత్సహించడానికి ఆర్థిక పరిపుష్టిని పెంపొందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ గొల్ల, కురుమలకు రాయితీపై గొర్రెలను ఇస్తున్నారని  చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. 


రైతు సంక్షేమానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం అందిస్తోందని తెలిపారు. రైతు బీమా పథకం ద్వారా రైతు కుటుంబాలకు భరోసా లభిస్తోందని సూచించారు. వానకాలం పంట పెట్టుబడి సాయాన్ని త్వరలోనే ప్రభుత్వం విడుదల చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వివిధ సంక్షేమ  పథకాలు దేశానికి ఆదర్శమని చెప్పారు. పల్లెల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్ లను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఏ జిల్లా ఉద్యోగాలు అదే జిల్లా కు చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానికత 95 శాతం అమలు చేస్తోందని పేర్కొన్నారు. మన ఊరు- మన బడి  కార్యక్రమం ద్వారా మొదటి విడతలో ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, వాటితో పాఠశాలల రూపురేఖలు మారుతాయని చెప్పారు. 


గొర్రెలు విక్రయించడానికి జంగంపల్లి శివారులో రెండు ఎకరాల స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్ కు సూచించారు. గొర్రెల సంత ఏర్పాటు కోసం 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని తెలిపారు. మత్స్య కారులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకు ప్రయోజనం చేకూరిందని, రైతులకు కావాల్సిన సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. గొర్రెలకు నట్టల మందు వేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి జగన్నాథ చారి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-04T23:25:55+05:30 IST