త్వరలో అమీర్ పేట హాస్పిటల్ లో డయాలసిస్ సేవలు: తలసాని

ABN , First Publish Date - 2021-10-14T20:09:11+05:30 IST

అమీర్ పేటలో కొత్తగా ప్రారంభించిన ఆస్పత్రిలో త్వరలోనే డయాలసిస్ సేవలు ప్రారంభిస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

త్వరలో అమీర్ పేట హాస్పిటల్ లో డయాలసిస్ సేవలు: తలసాని

హైదరాబాద్: అమీర్ పేటలో కొత్తగా ప్రారంభించిన ఆస్పత్రిలో త్వరలోనే డయాలసిస్ సేవలు ప్రారంభిస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం అమీర్ పేట లో 4.53 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల హాస్పిటల్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా  పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో 50 పడకల హాస్పిటల్ నిర్మాణానికి అనుమతించి నిధులు మంజూరు చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. 6 పడకలు గా ఉన్న ఈ హాస్పిటల్ ను 30 పడకల కు అప్ గ్రేడ్ చేస్తూ 2012 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 2.97 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కానీ నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 50 పడకల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలనే లక్ష్యంతో ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తలసాని సీఎం కేసీఆర్ కు విన్నవించారు. 


మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరిక మేరకు  2017 సంవత్సరం లో 50 పడకల హాస్పిటల్ గా నిర్మించేందుకు అనుమతిస్తూ 7.47 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు. 2018 సంవత్సరం లో పనులు చేపట్టినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా నిర్మాణ పనులు మధ్యలో కొద్ది రోజుల పాటు నిలిచిపోయాయని తెలిపారు. జీ ప్లస్ 2 పద్దతిలో హాస్పిటల్ భవనాన్ని ఒక్కో ప్లోర్ ను 9,451 SFT విస్తీర్ణంలో నిర్మించినట్లు తెలిపారు. ఈ హాస్పిటల్ కు వచ్చే పేషంట్స్ కోసం అల్ట్రా సౌండ్ స్కానర్, ఈసీజి , ఎక్స్ రే, ఇతర అత్యాధునిక వైద్య పరికరాలను 50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ హాస్పిటల్ ద్వారా అమీర్ పేట, సనత్ నగర్, జూబ్లీహిల్స్,  పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుతాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. 


భవిష్యత్ లో ఈ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని మంత్రి తలసాని చెప్పారు. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను చేరువ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఇప్పటికే బస్తీ దవాఖాన లను ప్రారంభించి ప్రజల చెంతకు వైద్య సేవలు తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. హాస్పిటల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మరో 50 పడకల  హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీఎస్ ఎంఐడిసి అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

Updated Date - 2021-10-14T20:09:11+05:30 IST