ఈ నెల 12న రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ ధర్నా

ABN , First Publish Date - 2021-11-10T20:52:37+05:30 IST

వ్యవసాయ రంగం పైనా, రైతులపైనా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 12న ఇందిరాపార్క్ వద్ద భారీఎత్తున ధర్నా నిర్వహించనుంది.

ఈ నెల 12న రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ ధర్నా

హైదరాబాద్: వ్యవసాయ రంగం పైనా, రైతులపైనా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 12న ఇందిరాపార్క్ వద్ద భారీఎత్తున ధర్నా నిర్వహించనుంది. ఈమేరకు బుధవారం ఇందిరా పార్కు వద్ద టిఆర్ఎస్ ధర్నా ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ శ్రీలత తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కేంద్రం తీరుపై ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. వారికి మద్దతుగా టిఆర్ఎస్ హైదరాబాద్ లో ఈ నెల12న భారీ ధర్నా నిర్వహించనుందని తెలిపారు. 


రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. కానీ కేంద్రం తెలంగాణను ప్రోత్సహించకుండా ఇబ్బంది పెడుతోందని మంత్రి ఆరోపించారు.కేంద్రం వ్యవసాయం రంగంలో నల్లచట్టాలని తెచ్చిందని, రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు నిరంతర పోరాటం చేస్తామని మంత్రి తలసాని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలతోరాష్ట్రాల నడ్డి కేంద్రం విరుస్తుందని దుయ్యబట్టారు. బిజేపీ రాష్ట్ర నేతలు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.  దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తామని అన్నారు.  


తెలంగాణ బీజేపీ తమ వైఖరి మార్చుకోవాలని కేంద్రం ఇక్కడి నేతలని పిలిచి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమ్మద్ అలీమాట్లాడుతూ ఈ నేల12 వ తేదిన జరిగే రైతు మద్దతు ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో పయనిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాల ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్దెత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో వరి సాగు పెరిగిందని తెలిపారు. 

Updated Date - 2021-11-10T20:52:37+05:30 IST