డ్రగ్స్ కు బానిసలు కావద్దు.. జీవితాన్నినాశనం చేసుకోవద్దు: మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-02-24T19:45:04+05:30 IST

తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పట్టుదలగా ఉన్నారని, ఈ విషయంలో మరిన్నికఠిన నిర్ణయాలు తీసుకోనున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

డ్రగ్స్ కు బానిసలు కావద్దు.. జీవితాన్నినాశనం చేసుకోవద్దు: మంత్రి  తలసాని

హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పట్టుదలగా ఉన్నారని, ఈ విషయంలో మరిన్నికఠిన నిర్ణయాలు తీసుకోనున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. పోలీసులు ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం వుందన్నారు. గురువారం నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ నివారణ పై తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే రెండు సార్లు ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. చాలా మంది తెలియకుండానే డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని, ఒక్కసారి డ్రగ్స్కు బానిసలు అయితే చావే శరణ్యమని అన్నారు. 


డ్రగ్స్ ఉపయోగించడం వలన కుటుంబాలు రోడ్డున  పడుతాయని, తప్పు చేసి జైలుకు వెళ్లడం ఎందుకు అసలు తప్పే చేయకుండా ఉంటే బావుంటుందని సూచించారు.చాలా నేరాలలో నేరస్తులను క్షణాల్లో పట్టుకునే సత్తా తెలంగాణ పోలీసులకే ఉందన్నారు. ప్రస్తుతం కార్పోరేట్ ఆఫీలకు ధీటుగా పోలీస్ స్టేషన్ కార్యాలయాలు ఉన్నాయని అన్నారు. సమాజంలో ఉన్న డ్రగ్స్ మాఫియాను నిర్ములించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు.విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీసే డ్రగ్స్ ను ప్రతి ఒక్కరం నిర్ములిద్దామని ఈసందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ లో పట్టుబడితే పోలీసులు ఎవ్వరిని వదిలి పెట్టరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

Updated Date - 2022-02-24T19:45:04+05:30 IST