మహిళా సంక్షేమానికి పెద్దపీట : తలసాని

ABN , First Publish Date - 2022-03-07T20:07:53+05:30 IST

మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

మహిళా సంక్షేమానికి పెద్దపీట : తలసాని

హైదరాబాద్: మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద  71 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ల క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో మంత్రి సెల్ఫీ లు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా పేదింటి ఆడపడుచుల వివాహానికి ఆర్ధిక సహాయం అందించడం లేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో  మాత్రమే అందిస్తుందని చెప్పారు.ఇప్పటి వరకు 13 లక్షల మందికి పైగా ఆర్ధిక సహాయం అందిందని పేర్కొన్నారు.  గర్భిణీ మహిళలను ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు, ప్రసవం అనంతరం క్షేమంగా ఇంటికి చేర్చేందుకు 300 అమ్మ ఒడి వాహనాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. అదేవిధంగా  ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం జరిగిన మహిళలకు కేసీఆర్ కిట్ క్రింద తల్లి బిడ్డకు అవసరమైన సామాగ్రితో పాటు ఆడబిడ్డకు పుడితే 13 వేలు, మగబిడ్డ పుడితే 12 వేల రూపాయల ఆర్ధిక సహాయం పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.


ఇవే కాకుండా గతంలో మహిళలు త్రాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడేవారని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి త్రాగునీరు ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు స్పూర్తి గా తీసుకొని ఆయా రాష్ట్రాలలో అమలు చేసేందుకు యోచిస్తున్నాయని చెప్పారు. ప్రయివేట్ ఫంక్షన్ హాల్స్ కు లక్షలాది రూపాయలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజల ను దృష్టిలో ఉంచుకొని మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్స్ ను నిర్మించి నామమాత్రపు అద్దెకు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గ పరిధిలోని బేగంపేట లో శంకుస్థాపన చేయడం జరిగిందని, త్వరలో సనత్ నగర్ లో కూడా నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకకొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Updated Date - 2022-03-07T20:07:53+05:30 IST