దుర్గంచెరువు మెట్రోస్టేషన్ వద్ద విజయ డెయిరీ పార్లర్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-08T00:07:23+05:30 IST

తెలంగాణ విజయా డెయిరీ తెలంగాణ బ్రాండ్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ వుందని పశుసంవర్ధక,డెయిరీ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

దుర్గంచెరువు మెట్రోస్టేషన్ వద్ద విజయ డెయిరీ పార్లర్ ప్రారంభం

రంగారెడ్డి: తెలంగాణ విజయా డెయిరీ తెలంగాణ బ్రాండ్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ వుందని పశుసంవర్ధక,డెయిరీ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మాదాపూర్ లోని దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ విజయ డెయిరీ ఐస్ క్రీమ్ పార్లర్ ను తలసాని తలసాని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐస్ క్రిముకు మంచి డిమాండ్ ఉన్నందున  తెలంగాణ విజయా డైయిరీ తెలంగాణ బ్రాండుతో  ఐస్ క్రిములను మార్కెట్ లోకి విడుదల చేశామని తెలిపారు. 8 రకాల ఐస్ క్రిములు వెనిలా, స్ట్రా బెర్రీ, బ్యూటర్ స్కాచ్, చాక్లెట్ , బెల్జియం  చాక్లెట్, మ్యాంగో , క్యారమిల్ నెట్స్, కేసరి బాదాం మరియు ఫ్రెంచ్ వెనిలా వంటి రక రకాల రుచులను మార్కెట్లోకి విడుదల చేశామన్నారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నష్టాలలో ఉన్న విజయ డెయిరీ సంస్థ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో 700 కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరుకుందని చెప్పారు. 


విజయ డెయిరీ నుండి ప్రస్తుతం చేస్తున్న పాలు, పాల ఉత్పత్తులకు అదనంగా నాణ్యమైన నూతన ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొచ్చే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా రావిర్యాల్ గ్రామ పరిధిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక టెక్నాలజీతో రూ.246 కోట్ల వ్యయంతో మెగాడెయిరీని నిర్మించామని వివరించారు. విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతులను ప్రోత్సహించాలనే ఆలోచనతో లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకంను అందజేసే కార్యక్రమాన్ని నవంబర్ 2014 సంవత్సరంలో ప్రారంభించినట్లు, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇతర సహకార డెయిరీలైన నార్మూల్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ మరియు ముల్కనూరు మహిళ డెయిరీలలో పాల సేకరణ చేయుచున్న పాడి రైతులకు కూడా నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు, చెప్పారు. ఇప్పటి వరకు రూ.343 కోట్లను ఈ పథకం క్రింద పాల ఉత్పత్తిదారులకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. సహకారం రంగంలో నిర్వహిస్తున్న విజయ డెయిరీ సంస్థకు వచ్చే లాభాలను వివిధ సంక్షేమ కార్యక్రమాలతో తిరిగి పాడి రైతులకే అందజేస్తున్నట్లు వివరించారు. 


పశువులకు వ్యాక్సినేషన్, నట్టల నివారణ మందుల పంపిణీ, సబ్సిడీ పై గడ్డి విత్తనాల సరఫరా, మారుమూల ప్రాంతాల్లోని పశువులకు 1966 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. పాడి రంగంపై ఆధారపడిన ప్రతి ఒక్కరు ఆర్ధిక స్వావలంభన సాధించేలా సహకారం అందిస్తున్నట్లు వివరించారు. పాడి రైతులకు అనేక విధాలుగా చేయూతను అందిస్తున్న విజయ డెయిరీ కి పాలు పోయడం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని లబ్దిపొందాలని పాడి రైతులను మంత్రి కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి,  ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఎంఎల్ఏ అరికెపూడి గాంధీ, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-03-08T00:07:23+05:30 IST