అంగరంగ వైభవంగా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం:Talasani

ABN , First Publish Date - 2022-06-29T20:40:00+05:30 IST

ప్రసిద్ధిపొందిన బల్కంపేట ఎల్లమ్మ(balkam peta yellamma) అమ్మవారి కల్యాణంను జూలై 5వతేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) తెలిపారు.

అంగరంగ వైభవంగా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం:Talasani

హైదరాబాద్: ప్రసిద్ధిపొందిన బల్కంపేట ఎల్లమ్మ(balkam peta yellamma) అమ్మవారి కల్యాణంను జూలై 5వతేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) తెలిపారు. బుధవారం అమీర్ పేట డివిజన్ లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి కళ్యాణం నిర్వహణ, ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా కళ్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న చీర తయారీ పనులను ఆలయ ఆవరణలో మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆలయం వెనుక భాగంలో భక్తుల వసతి కోసం 3.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. 


అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 5వ తేదీన అమ్మవారి కళ్యాణం, 6వ తేదీన రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి కళ్యాణాన్ని ఆలయం ముందు నిర్మించిన రేకుల షెడ్డు క్రింద గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సారి అమ్మవారి కల్యాణానికి 5 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కల్యాణాన్ని వివిధ ప్రాంతాలలోని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా TV లలో వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆలయ పరిసరాలలో 6 LED స్క్రీన్ లను అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 


దర్శనం సమయంలో భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించడం జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా ప్రత్యేకంగా CC కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు సేవలు అందించే వాలంటీర్ లకు ప్రత్యేక పాస్ లను జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే రహదారులలో అవసరమైన ప్రాంతాలలో ట్రాపిక్ డైవర్షన్ కు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఆలయ పరిసరాలలో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలని GHMC అధికారులను ఆదేశించారు. 



తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. బల్కంపేట ఆలయానికి నిత్యం వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం, దాతల సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఆలయ పక్క రోడ్డులో నూతనంగా భారీ రేకుల షెడ్డు ను దాతల సహకారంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T20:40:00+05:30 IST