అలా జరగడం తప్పే..

ABN , First Publish Date - 2020-09-23T08:35:26+05:30 IST

‘‘నాలాలో పడి చనిపోయిన వారి కుటుంబాలకు క్షమాపణ చెబుతున్నాం.

అలా జరగడం తప్పే..

నాలా మృతుల కుటుంబాలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ క్షమాపణలు

ప్రభుత్వం ఆదుకుంటుంది..

కాంగ్రెస్‌ నేతలది నీచ రాజకీయం.. పబ్లిసిటీ పిచ్చి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే ఆ పార్టీ డ్రామాలు చేస్తోందని విమర్శలు

నాలా మృతుల కుటుంబాలకు క్షమాపణలు

కేటీఆర్‌కు వారి సర్టిఫికెట్‌ అక్కర్లేదు: తలసాని 


హైదరాబాద్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘నాలాలో పడి చనిపోయిన వారి కుటుంబాలకు క్షమాపణ చెబుతున్నాం. ఇలాంటివి జరగడం తప్పే. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం’’అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కాంగ్రెస్‌ నేతలకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైందని, పబ్లిసిటీ చేసుకునేందుకు కూడా తెలివి కావాలని, నీఛ రాజకీయాలను ఆ పార్టీ నేతలు ఆపాలని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ పనితీరుకు కాంగ్రెస్‌ నేతల నుంచి సర్టిఫికెట్‌ అవసరం లేదని, హైదరాబాద్‌లో ఎవరినడిగినా ఆయన పని తీరు ఎలా ఉందో చెబుతారని తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకర్లతో తలసాని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత వివాదాలను కప్పి పుచ్చుకునేందుకే ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని, వారికి పార్టీ పరంగా ఏవైనా గొడవలు ఉంటే వాళ్ళ అధిష్టానం దగ్గర తేల్చుకోవాలని హితవు పలికారు.


తమకు ధైర్యం ఉందని, అందుకే కాంగ్రెస్‌ నేతలను తీసుకెళ్ళి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ నిర్మాణం దగ్గరికి తీసుకెళ్లామని తెలిపారు. హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఒక చోట కట్టామని తాము చెబితే... కాంగ్రెస్‌ నేతలు మరోచోటికి వెళ్లారని చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లాంటి బాధ్యత గల వ్యక్తి అన్నీ తెలుసుకుని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ పరిశీలనకు వెళ్లాల్సిందని అన్నారు. జూబ్లీహిల్స్‌లోని కమలానగర్‌లో 210 ఇళ్లు, 16 ఇళ్లు సారఽథినగర్‌లో కడుతున్నామని చెప్పారు. రైతులకు తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఎగ్గొట్టిన పార్టీ కాంగ్రెస్‌ అని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన భీంరావు వాడ వివాదం గురించి అందరికీ తెలిసిందే అని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వసున్నాయని కాంగ్రెస్‌ పార్టీ నేతలు డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. 

Updated Date - 2020-09-23T08:35:26+05:30 IST