మంత్రి వెల్లంపల్లె రాజీనామా చేయాలి: బీజేపీ

ABN , First Publish Date - 2022-01-29T05:17:39+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి రథం పాత చక్రాలు దగ్ధమైన ఘటనకు బాధ్యత వహిస్తూ దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లె శ్రీనివాస్‌ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

మంత్రి వెల్లంపల్లె రాజీనామా చేయాలి: బీజేపీ
వరసిద్ధుడి ఆలయం ఎదుట నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు - చక్రాలు దగ్ధమైన ప్రదేశంలో మట్టి పోసిన అధికారులు

ఐరాల(కాణిపాకం), జనవరి 28: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి రథం పాత చక్రాలు దగ్ధమైన ఘటనకు బాధ్యత వహిస్తూ దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లె శ్రీనివాస్‌ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రథ చక్రాలు దగ్ధమైన సంఘటన పట్ల బీజేపీ నాయకులు విచారం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విధ్వంసంతోనే పాలన మొదలు పెట్టిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో సుమారు 170 ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. రథంలోని ఇనుప చువ్వల కోసం చక్రాలను తగులబెట్టారని హేళనగా మాట్లాడిన అధికారిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. స్వామి వారి పాత రథ చక్రాలను భద్రపరచడం అధికారుల బాధ్యత అని అన్నారు. అంతర్వేదిలో ఓ చర్చిపై ఎవరో రాళ్లు వేస్తే నలబై మంది హిందువులను అరెస్టు చేశారని, కాణిపాకంలో రథ చక్రాలు కాల్చివేసి రెండు రోజులవుతున్నా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిందితులపై చర్యలు తీసుకునే వరకు పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దుర్గారామకృష్ణ, పెరుమాళ్ల సుబ్బారెడ్డి, చిట్టిబాబు, రామభద్ర, గురుగణేష్‌, బ్రహ్మానందరెడ్డి, కిషోర్‌కుమార్‌, హేమచంద్రారెడ్డి, లక్ష్మీప్రసాద్‌, కుమార్‌, హరినాథరెడ్డి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. 


రథ చక్రాలు దగ్ధమైన ఆనవాళ్ల చెరిపివేత 


వరసిద్ధుడి రథం పాత చక్రాలు దగ్ధమైన ప్రాంతంలో ఆనవాళ్లను ఆలయ అధికారులు చెరిపివేశారు. రథ చక్రాలు కాలిపోయిన ప్రాంతాన్ని మట్టితో కప్పి ఆనవాలు లేకుండా చేశారు. రథ చక్రాలు ఎలా దగ్ధమయ్యాయో విచారణ చేయకుండా ఆనవాళ్లే లేకుండా చేయడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కాపాడేందుకే ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-01-29T05:17:39+05:30 IST