కొవిడ్‌ కేసులు తగ్గుముఖం

ABN , First Publish Date - 2021-05-09T05:22:18+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కొవిడ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

కొవిడ్‌ కేసులు తగ్గుముఖం
రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్న వేణు

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు
రాజమహేంద్రవరం అర్బన్‌, మే 8: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కొవిడ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కొవిడ్‌ వ్యాప్తి ఈనెల 6వ తేదీన 42 శాతం ఉండగా, 7వ తేదీన 35 శాతం, 8వ తేదీన 33 శాతంగా నమోదు కావడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు బొమ్మూరు కొవిడ్‌ కేర్‌సెంటర్‌, డెల్టా ఆసుపత్రి, రాజు న్యూరో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులను శనివారం ఆయన తనిఖీ చేశారు. కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా, వైద్యసేవలు, అందుబాటులో ఉన్న పడకలు తదితర వివరాలను వైద్యులు, అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా, రెమిడెసివర్‌ మెడిసిన్‌, పడకలు, వైద్యసేవలను నిత్యం పర్యవేక్షించడం, కర్ఫ్యూ విధించడం వంటి చర్యలతో కేసుల తగ్గుదల సాధ్యమైందని అన్నారు. పడకల అందుబాటు, ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించి ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయని, అయితే గత వారంలో ఆక్సిజన్‌ సరఫరాలో కొంత ఇబ్బంది రావడంతో కలెక్టర్‌ తీసుకున్న చర్యలు కారణంగా సమస్య తొలగిపోయిందన్నారు. లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించి జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశను నియమించి 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారని, ఒడిసా నుంచి కూడా ఆక్సిజన్‌ సరఫరాకు చర్యలు తీసుకున్నారన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రిలో 459 మంది, గన్ని సుబ్బలక్ష్మి ఆస్పత్రిలో 300 మంది, స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 1,000 మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 1639 మంది కొవిడ్‌ అనుమానితులకు వ్యాధి  నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే వారిలో 1,000 మందికి పాజిటివ్‌గా తేలిందని మంత్రి వేణు తెలిపారు. బొమ్మూరు కేర్‌ సెంటర్‌లో 3 వేల మంది బాధితులకు అనువుగా పడకలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 300 మంది ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి.. ఆరోగ్యశ్రీ వర్తింపు, ప్రైవేట్‌ ఆసుపత్రుల ఫీజుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని, పవిత్రమైన వైద్యవృత్తిలో ఉన్నవారు దయాగుణంతో ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించాలని కోరారు. కొవిడ్‌తో మృతిచెందిన బాధిత కుటుంబాల నుంచి దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అంత్యక్రియల నిర్వహణ కోసం నోడల్‌ అధికారులను కూడా నియమించారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 25 మహా ప్రస్థానం అంబులెన్సుల ద్వారా కూడా మృతదేహాలు తరలిస్తున్నట్టు మంత్రి చెప్పారు. సెంట్రల్‌ జైలులో ఖైదీలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి, నగరపాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, డీసీహెచ్‌ఎస్‌ రమేష్‌కిశోర్‌, పలువురు అధికారులు, వైద్యాధికారులు ఉన్నారు.

Updated Date - 2021-05-09T05:22:18+05:30 IST