లండన్‌లో కేటీఆర్‌

ABN , First Publish Date - 2022-05-19T08:35:45+05:30 IST

యూకే, స్విట్జర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌ బుధవారం తెల్లవారుజామున లండన్‌ చేరుకున్నారు.

లండన్‌లో కేటీఆర్‌

  • ‘సర్ఫేస్‌ సిస్టమ్స్‌’ ప్రతినిధులతో మంత్రి సమావేశం
  • హైదరాబాద్‌లో లేబోరేటరీ ఏర్పాటు చేస్తామన్న సర్ఫేస్‌ సంస్థ ఎండీ
  • యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతోనూ కేటీఆర్‌ భేటీ


హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): యూకే, స్విట్జర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌ బుధవారం తెల్లవారుజామున లండన్‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు యూకేలోని టీఆర్‌ఎస్‌ విభాగం నేతలు, ఎన్‌ఆర్‌ఐ సంఘాల సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ లండన్‌లో స్వాగతం పలికారు. కాగా, కేటీఆర్‌ తొలిరోజు పర్యటనలో భాగంగా బుధవారం లండన్‌ కేంద్రంగా ఉన్న సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డారిల్‌ విలియమ్స్‌, ఇంటర్నేషనల్‌  సేల్స్‌ మేనేజర్‌ డానియల్‌ విల్లాలోబోస్‌, లండన్‌లోని ఇండియా ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ సయ్యద్‌ కుతుబుద్దీన్‌లతో సమావేశమయ్యారు. వారు తమ కంపెనీ ప్రణాళికలు, పరిశోధనలను మంత్రికి వివరించారు. పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని కేటీఆర్‌ వారికి వివరించగా.. తాము హైదరాబాద్‌లో పార్టికల్‌ క్యారెక్టరైజేషన్‌ లేబొరేటరీని ఏర్పాటు చేస్తామని వారు అన్నారు. ఆ లేబొరేటరీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలతో కలిసి పనిచేస్తుందన్నారు. 


ఈ ల్యాబ్‌ ఏర్పాటుతో తెలంగాణ ఫార్మారంగం ప్రతిష్ఠ అంతర్జాతీయంగా మరింత పెరుగుతుందన్నారు. తమ కంపెనీకి యూకేతోపాటు జర్మనీ, అమెరికా, చైనా, ఇండియాలో యూనిట్లు ఉన్నాయని తెలిపారు. అపార నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు తమతో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌ లాంటి పారిశ్రామిక అనుకూలతలు ఉన్న నగరంలో తమ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌ ఫార్మారంగంలో ప్రవేశించబోతున్న సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్స్‌కు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్‌లో ల్యాబ్‌ను ఏర్పాటుచేయడం ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు ఉన్న తిరుగులేని ఆధిపత్యానికి నిదర్శనమన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, తెలంగాణ ప్రభుత్వ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి ఎం నాగప్పన్‌ కూడా పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T08:35:45+05:30 IST