నేడు ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్ష

ABN , First Publish Date - 2020-10-22T06:47:24+05:30 IST

రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై గురువారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

నేడు ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్ష

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 21: రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై గురువారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గురు, శుక్ర, ఆదివారాల్లో ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం 11.30 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో మహిళా, మత్స్యశాఖ సహకార సంఘాలకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రివాల్వింగ్‌ ఫండ్‌ను అందజేయనున్నారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించనున్నారు. సాయంత్రం 4 గంటలకు వేల్పూర్‌, కమ్మర్‌పల్లి మండలాలకు సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేయనున్నారు.


శుక్రవారం ఉదయం 10 గంటలకు భీమ్‌గల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి సాయంత్రం 4.00 గంటలకు మోర్తాడ్‌, భీమ్‌గల్‌ మండలాలకు సంబంధించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎం సహాయనిధి చెక్కులను అందజేస్తారు.  ఈనెల 25 ఆదివారం ఉదయం 10 గంటలకు వేల్పూర్‌ మండల కేంద్రంలో దివంగత వేముల సురేందర్‌రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన రైతువేదిక క్లస్టర్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. 11 గంటలకు ఏవీఎస్‌ అకాడమి డిస్టన్స్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ను వేల్పూర్‌లో మంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం వేల్పూర్‌ మండల కేంద్రంలో జరిగే దసరా వేడుకల్లో మంత్రి పాల్గొంటారు. 

Updated Date - 2020-10-22T06:47:24+05:30 IST