మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీని తప్పించుకున్నా, కోవిడ్‌ పీడ తప్పలేదు

ABN , First Publish Date - 2022-01-01T22:12:18+05:30 IST

శాసన సభ సమావేశాలను కుదించినప్పటికీ దాదాపు 10 మంది మంత్రులు

మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీని తప్పించుకున్నా, కోవిడ్‌ పీడ తప్పలేదు

పుణే (మహారాష్ట్ర) : శాసన సభ సమావేశాలను కుదించినప్పటికీ దాదాపు 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు కోవిడ్ బారిన పడ్డారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు. ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ప్రజలంతా కోవిడ్ సంబంధిత మార్గదర్శకాలను పాటించాలని కోరారు. భీమా-కొరెగావ్ యుద్ధ స్మారక స్థూపం వద్ద శనివారం నివాళులర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 


కోవిడ్-19 మహమ్మారి మహారాష్ట్రలో వేగంగా పెరుగుతున్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. ఈ మహమ్మారి పెరుగుతున్నందువల్లే శాసన సభ శీతాకాల సమావేశాలను 5 రోజులకు కుదించవలసి వచ్చిందని, అయినప్పటికీ 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు, 10 మంది మంత్రులకు కోవిడ్-19 సోకిందన్నారు. 


సంపూర్ణ అష్ట దిగ్బంధనం లేదా కఠినమైన ఆంక్షల విధింపు వంటి నిర్ణయాలు తీసుకోవడంపై టాస్క్‌ఫోర్స్‌తో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. రోజువారీ ఇన్ఫెక్షన్ల రేటును పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రోగుల సంఖ్య వేగంగా పెరగడం ప్రారంభమైతే, ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా తదుపరి కఠిన చర్యలు తీసుకోవలసిన సమయం వస్తుందన్నారు. అయితే అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. 




Updated Date - 2022-01-01T22:12:18+05:30 IST