మంత్రులకు టెంట్లు... జనం మాత్రం ఎండలో

ABN , First Publish Date - 2022-05-27T00:18:41+05:30 IST

సిక్కోలు నుంచి రాష్ట్ర మంత్రులు తలపెట్టిన ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర’ గురువారం ప్రారంభమైంది.

మంత్రులకు టెంట్లు... జనం మాత్రం ఎండలో

శ్రీకాకుళం: సిక్కోలు నుంచి రాష్ట్ర మంత్రులు తలపెట్టిన ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర’ గురువారం ప్రారంభమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన మంత్రులు మొత్తం 17 మంది పాల్గొనాల్సిఉండగా... 15 మంది మాత్రమే హాజరయ్యారు. కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, రవాణా శాఖమంత్రి పినిపి విశ్వరూప్‌లు గైర్హాజరయ్యారు. ముందుగా అరసవల్లిలో శ్రీసూర్యభగవానుడ్ని మంత్రులు దర్శించుకున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఉపాధిహామీ కూలీలను రప్పించారు. అయితే సభలో వేదికపై ఉన్న మంత్రులకు టెంట్లు ఏర్పాటు చేశారు కానీ, జనం మాత్రం ఎండలో ఉండిపోయారు. ఎండ వేడిమి భరించలేక వారిచేతికి పార్టీనాయకులు ఇచ్చిన ప్లకార్డులను తలపై పెట్టుకుని ప్రసంగాన్ని ఆలకించారు. ఆ సమయంలో కొంతమందికి దాహం వేసి తమను వాటర్ ప్యాకెట్‌లైనా ఇప్పించాలని కోరారు. పాతబస్టాండ్‌ నుంచి సభ జరుగుతున్న ప్రాంతం వరకు సమీప దుకాణాలను మూసివేయించారు. దీంతో వాటర్‌ప్యాకెట్‌లు దొరకలేదు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక కూలీలు సభ మధ్యలో వెళ్లిపోయారు. 

Updated Date - 2022-05-27T00:18:41+05:30 IST