మంత్రుల బాధ్యతారాహిత్యం...

ABN , First Publish Date - 2022-03-10T17:18:51+05:30 IST

శాసనసభలో మంత్రులు అత్యధికసంఖ్యలో గైర్హాజరు కావడంతో స్పీకర్‌ విశ్వేశ్వరహెగ్డే కాగేరి తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం సభ ప్రారంభమవుతూనే ప్రశ్నోత్తరాల వేళ ప్రశ్నలకు బదులు ఇవ్వాల్సిన

మంత్రుల బాధ్యతారాహిత్యం...

                - గైర్హాజరుపై శాసనసభలో స్పీకర్‌ ఆగ్రహం



బెంగళూరు: శాసనసభలో మంత్రులు అత్యధికసంఖ్యలో గైర్హాజరు కావడంతో స్పీకర్‌ విశ్వేశ్వరహెగ్డే కాగేరి తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం సభ ప్రారంభమవుతూనే ప్రశ్నోత్తరాల వేళ ప్రశ్నలకు బదులు ఇవ్వాల్సిన మంత్రులు కనిపించకపోవడంతో ఆయన అసహనానికి లోనయ్యారు. సభ ప్రారంభమై నాలుగురోజులైంది. అప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రులు పదే పదే గైర్హాజరవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అజెండాను చాలా ముందుగానే మంత్రులకు పంపుతున్నామని, అందుకు అనుగుణంగా సభలో ఉండాల్సిన మంత్రులు గైర్హాజరు కావడం మంచి సంప్రదాయం కాదన్నారు. అంతకుముందు మంత్రులు గైర్హాజరు కావడంతో సభా కార్యకలాపాలను కొద్దిసేపు వాయిదా వేయాలని జేడీఎస్‌ గట్టిగా పట్టుబట్టింది. జేడీఎస్‌ శాసనసభాపక్షనేత హెచ్‌డీ కుమారస్వామి బడ్జెట్‌పై ప్రసంగించిన సమయంలో అనేకమంది మంత్రులు హాజరు కాలేదని, ఇదెక్కడి చోద్యమని పార్టీ ఎమ్మెల్యేలు నాడగౌడ, ఏటీ రామస్వామి, అన్నదాని తదితరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

 

ఈ సందర్భంలోనే స్పీకర్‌ జోక్యం చేసుకుని మంత్రుల గైర్హాజరుపై అసంతృప్తి వెళ్లగక్కారు. అధికార పార్టీ ఎమ్మెల్యే యత్నాళ్‌ మరో అడుగు ముందుకేసి సభా మర్యాదలు కాపాడే బాధ్యత మంత్రులకు లేదా..? అలంకారప్రాయంగా ఉన్నమంత్రులను తొలగించండి అంటూ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ సభ్యుడు హెచ్‌కే పాటిల్‌ జోక్యం చేసుకుని స్పీకర్‌ వాదనను బలపరిచారు. రానురాను శాసనసభ తన గౌరవాన్ని కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల గైర్హాజరు అంశంపై సభలో కొద్దిసేపు వాడి వేడిగా చర్చ జరిగింది. ఈలోపు ప్రభుత్వ చీఫ్‌విప్‌ హడావుడిగా బయటకు వెళ్లి మంత్రులను సభలోకి రప్పించేందుకు ప్రయత్నించారు. 

Updated Date - 2022-03-10T17:18:51+05:30 IST