కోతుల బెడదను నివారించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుంది

ABN , First Publish Date - 2022-01-22T00:36:00+05:30 IST

రాష్ట్రంలో కోతుల నియంత్రణకు కుటుంబ నియంత్రణ చికిత్స అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

కోతుల బెడదను నివారించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుంది

హైదరాబాద్: రాష్ట్రంలో కోతుల నియంత్రణకు కుటుంబ నియంత్రణ చికిత్స అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కోతుల బెడద నివారణపై అరణ్య భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెరుగుతున్నకోతుల బెడదను నివారించాలని వారు నిర్ణయించారు. కోతుల నియంత్రణకు గతంలోనే కమిటీ ఏర్పాటు చేశామని, ఇప్పటికే పలు అంశాలపై అధ్యయనం జరుగుతోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.


రాష్ట్రంలో 5 నుండి 6 లక్షల కోతులు ఉన్నట్టు అంచనా. ప్రతి జిల్లాలో కోతులకు కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఒక్కొక్క జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యంతో కుటుంబ నియంత్రణ చికిత్సల నిర్వహణకు అవకాశాల పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పంటలకు కూడా  కోతుల బెడద తీవ్రంగా ఉందని అన్నారు. రైతులను ఈ ఇబ్బంది నుండి గట్టెక్కించాలన్నారు.చేతికొచ్చిన పంటలు కోతుల పాలవుతుంటే రైతులు మనోవేదనకు గురవుతున్నారు. కోతుల నియంత్రణకు చట్టపరిధిలో ఉండే ఇతర అవకాశాలను పరిశీలించాలని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు. 


అడవులు, జాతీయ రహదారులపై పండ్ల మొక్కలను ప్రతి సీజన్ కు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పల్లె ప్రకృతి వనాలలో పండ్ల మొక్కలు తప్పనిసరిగా పెంచాలని కూడా మంత్రలులు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలలో వేసిన పండ్ల మొక్కలు అప్పుడే ఫలితాలనిస్తున్నాయని, రైతులకు కోతుల బెడదను తప్పించాలన్న విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. కోతుల బెడద నివారించాలంటే కోతుల గణన, వాటి వల్ల రైతులకు జరుగుతున్న నష్టం అంచనా వేయాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 8 మంది అధికారుల కమిటీతో మంత్రుల కమిటీతో మంత్రులుచర్చించారు. 

Updated Date - 2022-01-22T00:36:00+05:30 IST