మంత్రికి షాడో!

ABN , First Publish Date - 2020-11-16T06:32:09+05:30 IST

ఆయన జిల్లా మంత్రికి షాడో. మంత్రి కారే ఆయన కార్యాలయం. ఆ కారులో కూర్చునే అధికారులకు అడ్డగోలు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటాడు

మంత్రికి షాడో!

  • పోలీస్‌స్టేషన్‌లో ఆయన చెప్పిందే వేదం
  • ఇళ్ల స్థలాల మెరక పనుల్లో అక్రమార్జన
  • జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో మందు పార్టీలు
  • అధికారులను వేధించడంలోనూ అందెవేసిన చేయి

ఆయన జిల్లా మంత్రికి షాడో. మంత్రి కారే ఆయన కార్యాలయం. ఆ కారులో కూర్చునే అధికారులకు అడ్డగోలు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటాడు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఒక మండలాన్ని ఈయన తన గుప్పిట్లో పెట్టుకుని, అక్రమాలకు తెరతీశాడనే విమర్శలు వినవస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలోనే ఈయన కోట్లు వెనకేసుకున్నాడనే ఆరోపణలున్నాయి.  ఎలాంటి అధికార పదవీ లేని ఈ షాడో అధికార కార్యక్రమాలన్నింటిలో హల్‌చల్‌ చేయడం విమర్శలకు తావిస్తోంది. 


మచిలీపట్నం :  జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో షాడో మంత్రి ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించిపోతున్నాయి. మచిలీపట్నం మండలానికి చెందిన కార్యకర్తలు, నాయకులు, కష్టంలో ఉన్నవారు ఎవరైనా మంత్రి వద్దకు వస్తే వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రి తన వెంట ఉన్న షాడోకు పురమాయిస్తున్నారు. దీంతో  సమస్యల  పరిష్కారం సంగతి పక్కనపెట్టి ఈయన తనదైన శైలిలో కార్యకర్తలను, నాయకులను ఇరుకున పెడుతున్నాడని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు.  నిత్యం మంత్రికి నీడలా ఉండే ఈయన ఆగడాలకు అంతు లేకుండా పోతోందని అధికార పార్టీ కార్యకర్తలే చెప్పుకోవడం గమనించదగ్గ అంశం.


మత్స్యశాఖ కార్యాలయంలో మందు పార్టీలు 

మచిలీపట్నం రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ఒక గదిని ఈయన తన డెన్‌గా మార్చుకున్నాడు. తన మనిషికి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్ష పదవి వచ్చేలా చక్రం తిప్పిన ఈ షాడో, రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా ఇక్కడ అధ్యక్షుడికి చాంబరును కేటాయింపజేసుకున్నారు. ఈ చాంబరు నుంచే షాడో తన అక్రమ కార్యకలాపాలన్నింటినీ చక్కబెడుతున్నారని, పగలు, రాత్రి తేడా లేకుండా ఈ చాంబరులోనే మందు పార్టీలు నిర్వహిస్తుంటాడని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధ్యక్షుడికి తమ సమస్యలను  చెప్పుకునేందుకు కార్యాలయానికి వచ్చే మత్స్యకారులు అక్కడ షాడో మంత్రి, ఆయన అనుచరులతో మద్యం సేవిస్తూ హల్‌చల్‌ చేస్తుండడంతో చేసేదేమీ లేక తాము వెనుదిరుగుతున్నామని వాపోతున్నారు.


షాడో కనుసన్నల్లోనే తాలూకా పోలీస్‌స్టేషన్‌ 

తాలూకా పోలీస్‌స్టేషన్‌లోనూ షాడో హవా సాగుతోందనే విమర్శలున్నాయి. ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది ఈయన చెప్పిన ప్రతి దానికీ తలలూపుతూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఐదారు నెలలుగా జిల్లా పోలీసులు పరివర్తన కార్యక్రమం పేరుతో కాపుసారాను అరికట్టేందుకు చేయని ప్రయత్నంలేదు. ఈ షాడో సొంత గ్రామంలో కాపుసారా తయారుచేసి, విక్రయిస్తున్న ఇద్దరిని తాలూకా పోలీసులు  పట్టుకున్నారు.  వారిపై ఎలాంటి కేసు పెట్టకుండా షాడో తెరవెనుక చక్రం తిప్పాడని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు  తన గ్రామంలో కాపుసారా బట్టీలపై ఎలాంటి దాడులు చేయవద్దని షాడో తాలూకా పోలీసులకు హుకుం జారీచేశారని గ్రామస్తులు  చెప్పుకోవడం గమనించదగ్గ అంశం. 


ఇళ్ల స్థలాల మెరక పేరుతో..

మండలపరిధిలో 34 గ్రామ పంచాయతీల్లో 6,500మంది పేదలకు  ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇళ్ల స్థలాల మెరక పనులన్నింటినీ చేజిక్కించుకున్న ఈ షాడో మంత్రి  తనదైన శైలిలో పనులు చేసి మమ అనిపించారని ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. గిలకలదిండిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన భూమిని మెరకచేసేందుకు ప్రభుత్వ భూముల్లోని మట్టిని తరలించి, రూ.కోటి సొమ్ము చేసుకునేందుకు స్కెచ్‌ వేశాడు. ప్రతిపక్షపార్టీ ఈ స్థలం నివాసయోగ్యంగా లేదని కోర్టును ఆశ్రయించడం, కోర్టు మొట్టికాయలు వేయడంతో ఈ షాడో మంత్రి అక్రమార్జనకు బ్రేక్‌ పడింది.  

Updated Date - 2020-11-16T06:32:09+05:30 IST