Residency violators: అమ్నెస్టీ అమలు చేసే యోచనలో కువైత్?

ABN , First Publish Date - 2022-03-15T13:36:51+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌ రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు మరో అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Residency violators: అమ్నెస్టీ అమలు చేసే యోచనలో కువైత్?

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు మరో అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెసిడెన్సీ ఉల్లంఘనదారులు వారి రెసిడెన్సీ స్టేటస్‌ను సరిచేసుకునేందుకు అమ్నెస్టీని అమలు చేసే యోచనలో ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ ఉన్నట్లు అక్కడి ఓ ప్రముఖ మీడియా ఏజెన్సీ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడిన వారిని ఎలాంటి జరిమానాలు చెల్లించకుండా కువైత్ విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలనేది మంత్రిత్వశాఖ ప్రతిపాదనగా తెలుస్తోంది. దీనికోసం గ్రేస్ పీరియడ్‌ను ఇవ్వాలనేది మినిస్ట్రీ ఆలోచన. ఇచ్చిన గడువులోపు ఉల్లంఘనదారులు ఎలాంటి జరిమానా చెల్లించకుండా దేశం విడిచి వెళ్లిపోవచ్చు. అలాగే కొంతకాలం తర్వాత చట్టానుసారంగా కొత్త వీసాలపై మళ్లీ వారు కువైత్‌కు తిరిగి వచ్చేలా అనుమతి ఇవ్వాలని భావిస్తోందట. అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన రెసిడెన్సీ అఫైర్స్ విభాగం దీన్ని ప్రతిపాదించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. 


ఇలా చేయడం ద్వారా భారీ సంఖ్యలో చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్నవారు కువైత్ వదిలి వెళ్లిపోతారని సంబంధిత అధికారులు తమ ప్రతిపాదనలో పేర్కొన్నట్లు సమాచారం. ఇక రెసిడెన్సీ స్టేటస్‌ను మార్చుకోవాలంటే మాత్రం దానికి తగిన ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. తద్వార వారు కువైత్‌లో నివాసం ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రతిపాదన కనుక అమలైతే మాత్రం రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు మంచి అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే ఉల్లంఘనలకు పాల్పడినవారు ఒక్క పైసా కూడా జరిమానా కట్టకుండా వారివారి దేశాలకు వెళ్లిపోవచ్చు. కాగా, అధికారిక సమాచారం ప్రకారం కువైత్‌లో ప్రస్తుతం 1.30 లక్షల మంది వరకు ఉల్లంఘనదారులు చట్ట విరుద్ధంగా నివాసం ఉంటున్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే.. ఇంతకుముందు కూడా కువైత్ సర్కార్ పలుమార్లు ఉల్లంఘనదారులకు అమ్నెస్టీని అమలు చేసిన విషయం తెలిసిందే.    

Updated Date - 2022-03-15T13:36:51+05:30 IST