మైనరు.. తగ్గాలి జోరు..!

ABN , First Publish Date - 2022-06-28T07:24:33+05:30 IST

సరైన వయసు.. అవగాహన.. శిక్షణ లేని వ్యక్తి చేతిలో ఉన్న వాహనం ఒక ప్రమాదకర ఆయుధం వంటిదే. అది వారితోపాటు ఇతరులకు హాని కల్గించక మానదు. 18 ఏళ్లలోపువారు వాహనాలపై మోజుతో, స్నేహితులతో కలిసి సరదా కోసమో, ఇతరుల మెప్పు కోసమో బండి కనిపిస్తే చాలు ఉరకలేస్తూ.. సవారీ చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాల బారినపడి తమ ప్రాణాలను కోల్పోవడంతోపాటు ఇతరుల ప్రాణాలనూ చిక్కుల్లో పడేస్తున్నారు.

మైనరు.. తగ్గాలి జోరు..!
ద్విచక్ర వాహనాలపై నలుగురు, ముగ్గురు చొప్పున వెళుతున్న యువత

ఒక వాహనంపై ముగ్గురు, నలుగురేసి చొప్పున చక్కర్లు

ఎదుటి వారి ప్రాణాలకూ  పొంచివున్న ముప్పు


తిరుపతి (సిటీ/నేర విభాగం), జూన్‌ 27: రెండు నెలల కిందట శ్రీకాళహస్తికి చెందిన పదో తరగతి విద్యార్థి(15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తండ్రి ద్విచక్ర వాహనాన్ని తీసుకుని రోడ్డుపైకొచ్చాడు. ఆపై స్నేహితులతో కలిసి రోడ్లపై చక్కర్లు కొడుతుండగా.. వాహనం అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చొని ఉన్న ఓ బాలుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 


నెల కిందట గూడూరుకు చెందిన ఇంటర్‌ విద్యార్థి  మంచి మార్కులతో పాసవ్వాలంటే ద్విచక్ర వాహనం కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగాడు. సరదాగా అడుగుతున్నాడులే అనుకుని.. వారు సరేనన్నారు. అంతే ఆ విద్యార్థికి ద్విచక్ర వాహనంపై మరింత మోజు పెరిగింది. అదే ఉత్సాహంతో ఇంటర్‌ పరీక్షలూ రాశాడు. వాహనం కొనిచ్చేలోగా తాను బాగా నేర్చుకోవాలన్న ఆలోచనతో ఇంట్లోని తన తండ్రి బైక్‌ తీసుకుని రోడ్డుపైకొచ్చాడు. ఆటో ఢీకొనడంతో మృత్యు ఒడి చేరి.. కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. 


సరైన వయసు.. అవగాహన.. శిక్షణ లేని వ్యక్తి చేతిలో ఉన్న వాహనం ఒక ప్రమాదకర ఆయుధం వంటిదే. అది వారితోపాటు ఇతరులకు హాని కల్గించక మానదు. 18 ఏళ్లలోపువారు వాహనాలపై మోజుతో, స్నేహితులతో కలిసి సరదా కోసమో, ఇతరుల మెప్పు కోసమో బండి కనిపిస్తే చాలు ఉరకలేస్తూ.. సవారీ చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాల బారినపడి తమ ప్రాణాలను కోల్పోవడంతోపాటు ఇతరుల ప్రాణాలనూ చిక్కుల్లో పడేస్తున్నారు. కన్న వారి కలలను కలగా మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. పెద్దలు కూడా వాహనాలను ఇచ్చే విషయంలో తమ బిడ్డలకు నచ్చచెప్పలేక పోతున్నారు. భరించలేదని కష్టం వచ్చాక.. దేవుడిని నిందిస్తున్నారు. 


ఉమ్మడి జిల్లాలో పరిస్థితి


ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 15-18 ఏళ్లలోపువారు 1,80,020 మంది ఉన్నారు. అలాగే సుమారు రెండు లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. అలాగే దాదాపు 15వేల మందికి పైగా ఇంటర్‌ విద్యార్థులు ద్విచక్ర వాహనాలపైనే కళాశాలలకు వెళుతున్నారు. వీరు ఒక్కో ద్విచక్ర వాహనంపై ఇద్దరు, ముగ్గురు, నలుగురు కూడా ప్రయాణం చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పోలీసుల తనిఖీలప్పుడు తప్పించుకునే ప్రయత్నంతోపాటు ఇతరులను ఆకట్టుకోవడానికి వాహనాలను వేగంగా నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు.


మైనర్లకు వాహనం ఇవ్వడమే నేరం


యువ ప్రాయంలో అడుగుపెట్టే అబ్బాయిలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలను నడపాలని.. వేగంగా తిరగాలని.. స్నేహితులతో కలిసి బైక్‌ రేసింగ్‌లు, దూరపు ప్రయాణాలను ఇష్టపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మోజులోనే జిల్లాలో రోజుకు ఒకరిద్దరు ద్విచక్ర వాహనాల ప్రమాదంలో మృతి చెందుతున్నారు. నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం వల్లే ఇలా ప్రమాదాల బారిన పడుతున్నారు. మైనర్లకు వాహనం ఇస్తే ఆ బండి యజమానికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.25వేల జరిమానా విధించవచ్చు. అలాగే ఏడాది పాటు మోటారు వాహనం రిజిస్ర్టేషన్‌ రద్దుకు అనుమతిస్తారు. ప్రమాదం చేసిన మైనర్‌కు 25 ఏళ్ల వరకు లెర్నర్‌ లైసెన్సు  జారీ చేయరు.


చట్ట ప్రకారం 18 ఏళ్లు నిండాల్సిందే..


18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతే ఎవరికైనా రవాణా వాహనాలు నడిపేందుకు అనుమతి ఉంటుంది. మైనర్లకు రోడ్లపై వాహనాలతో వచ్చే అనుమతి కూడా లేదు. అలాగే నాలుగు నుంచి తొమ్మిదేళ్లలోపు చిన్నారులతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుంటే క్రాష్‌ హెల్మెట్‌ లేదా సైకిల్‌ హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని నిబంధనలు చెబుతున్నాయి. అలాగే పిల్లలతో ప్రయాణించే ద్విచక్ర వాహన వేగం గంటకు 40 కిలోమీటర్లు మించరాదు.


అవగాహన కార్యక్రమాలు అంతంత మాత్రమే


రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాలు అంటూ ఏడాదికి ఒకసారి మాత్రమే తూతూ మంత్రంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి చేతులు దులుపుకుంటోంది. ఇలా కాకుండా సాధారణ రోజుల్లోనూ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతా నియమాలు, నిబంధనలు, ప్రమాదాలు వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఉత్తరాది రాష్ర్టాల్లో మైనర్లకు, యువకులకు మోటారు వాహన చట్టంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. ఢిల్లీలో పాఠశాలస్థాయి నుంచే విస్తృతంగా రోడ్డు భద్రతలపై సంపూర్ణ అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. మన రాష్ట్రంలో ఇలాంటివి అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. ఇకనైనా వాహనాలు నడిపే మైనర్లను గుర్తించి.. వారితోపాటు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం వంటివి పెంచాలి.

Updated Date - 2022-06-28T07:24:33+05:30 IST