ఓడీవోఎఫ్‌పీ కింద.. పసుము, మిర్చి ఎంపిక

ABN , First Publish Date - 2021-02-28T05:44:15+05:30 IST

ఒక జిల్లా ఒకే ఉత్పత్తిపై దృష్టి(ఓడీఎఫ్‌వోపీ) కింద జిల్లాలో మిర్చి, పసుపు పంటలని గుర్తించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో సంప్రదించిన అనంతరం వ్యవసాయశాఖ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

ఓడీవోఎఫ్‌పీ కింద.. పసుము, మిర్చి ఎంపిక

పీఎం-ఎఫ్‌ఎంఈ స్కీమ్‌ ద్వారా ఆయా పంటలకు మద్దతు

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ


గుంటూరు, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఒక జిల్లా ఒకే ఉత్పత్తిపై దృష్టి(ఓడీఎఫ్‌వోపీ) కింద జిల్లాలో మిర్చి, పసుపు పంటలని గుర్తించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో సంప్రదించిన అనంతరం వ్యవసాయశాఖ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకొంది. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆయా ఉత్పత్తులను ప్రమోట్‌ చేయనున్నట్లు పేర్కొంది. తద్వారా వాటి విలువ పెరిగి అంతిమంగా రైతుకు లాభం చేకూర్చడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా స్పష్టం చేసింది. ఓడీవోఎఫ్‌పీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం ద్వారా వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులకు అదనపు విలువ జోడించబడుతుందని పేర్కొంది. 

     మిర్చి పంటకు జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ పండే మిర్చి దేశ, విదేశాలకు ఎగుమతి అవుతుంది. అంతర్జాతీయంగా గుంటూరు మిర్చి ప్రసిద్ధి గాంచింది. ఊటా 78,454 హెక్టార్లలో మిర్చి ఇక్కడ సాగు అవుతోంది. దీని వలన 4.38 లక్షల మెట్రిక్‌టన్నుల మిర్చి దిగుబడి జరుగుతోంది. తేజ, బ్యాడిగి, నెంబరు. 341 వంటి వెరైటీలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇక్కడి నుంచి రైళ్ల ద్వారా బంగ్లాదేశ్‌కి మిర్చి ఎగుమతి జరిగింది. అలానే ఆసియా ఖండంలోని మరికొన్ని దేశాలకు కూడా మిర్చి ఎగుమతి జరుగుతోంది. 

ఇదేవిధంగా పసుపు కూడా దుగ్గిరాల మార్కెట్‌ యార్డు నుంచి విదేశాలకు ఎగుమతి జరుగుతోంది. జిల్లాలో 4,806 హెక్టార్లలో 4.54 లక్షల మెట్రిక్‌టన్నుల పసుపు దిగుబడి వస్తోంది. దీంతో ఈ రెండు పంటలను ఓడీవోఎఫ్‌పీ కింద గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర వ్యవసాయ శాఖ మిర్చి, పసుపుని ఓడీవోఎఫ్‌పీ కింద ఎంపిక చేసిన దృష్ట్యా పీఎం-ఎఫ్‌ఎంఈతో పాటు కేంద్రం అమలు చేస్తున్న ఎంఐడీహెచ్‌, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం, ఆరకేవీవై, పీకేవీవై పథకాలు కూడా వర్తింపు చేస్తారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ నూతన కార్యక్రమం వలన జిల్లాలోని పసుపు, మిర్చి రైతులకు మేలు చేకూరుతుందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 


 

Updated Date - 2021-02-28T05:44:15+05:30 IST