కొంపముంచిన కొత్తరకం

ABN , First Publish Date - 2021-10-17T06:41:04+05:30 IST

కొంపముంచిన కొత్తరకం

కొంపముంచిన కొత్తరకం
ఎదుగుదల లేకపోవడంతో మొక్కలను తొలగిస్తున్న దృశ్యం

రైతులకు నూతన మిర్చి విత్తనాలు అంటగట్టిన ఓ కంపెనీ 

ఎదుగుదల నిలిచిపోయిన పైరు

చర్ల మండలంలో 50ఎకరాల్లో పంట తొలగింపు

విత్తనాల్లో తేడాలున్నాయని రైతుల ఆరోపణ 

చర్ల, అక్టోబరు 16: అధిక దిగుబడులు వస్తాయని ఓ కంపెనీ ఇచ్చిన మిర్చి విత్తనాలు సాగు చేసిన రైతులు నేడు కన్నీరు పెడుతున్నారు. మొక్కల్లో ఎదుగుదల లేకపోగా మొక్క వడలిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొద్ది రోజుల్లో పంట చేతికి రావాల్సిన తరణంలో ఇదేం పరిస్థితి అని విలపిస్తున్నారు. మొక్కలు ఆరోగ్యంగా లేకపోవడంతో శనివారం భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని చింతగుంట, మొగళ్ళపల్లి గ్రామాల్లో రైతులు మొక్కలు పీకేశారు. గత నాలుగు రోజులుగా ఆయా గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో మొక్కలను రైతులు తొలగించారు. ఇప్పటికే ఎకరాకు లక్షన్నర పెట్టుబడులు పెట్టామని, ఇంకా పెట్టుబడి పెట్టినా మొక్కల్లో మార్పు వస్తుందనే నమ్మకం లేకపోవడంతోనే  మొక్కలను తీసేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉద్యానశాఖ అధికారులు మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదని రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఎదుగుదల నిలిచిపోయిన మొక్కలు

చర్ల మండలంలో మిర్చిసాగు అధికంగా ఉంటుంది. ఈ ఏడాది కొంతమంది రైతులు ఓ కంపెనీకి చెందిన మిర్చి విత్తనాలు సాగు చేశా రు. అయితే మొక్కల్లో ఎదుగుదల పూర్తిస్థాయిలో లేకపోగా ఏరు సరిగ్గా లేకపోవడం, కాడం కుళ్లిపోవడం, ఉదయం, సాయంత్రం సమయాల్లో మొక్కల్లో తేడాలు ఉంటున్నాయని రైతులు చెబుతున్నారు. తెగులు వచ్చిందనే అలోచనతో రైతులు వివిధ మందులు పిచికారీ చేసినా ఫలితం లేక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉద్యానశాఖ అధికారులు కూడా పంటలను పరిశీలించి నివారణ చర్యలు తీసుకోలేదు. దాంతో చేసేదేమీ లేక నాటిన మొక్కలను పీకేస్తున్నారు. గత నాలుగు రోజులుగా మండలంలో సుమారు 50 ఎకరాల్లో తొటలను రైతులు తొలగించారు. మరి కొంత మంది రైతులు కూడా తొగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

విత్తనాల్లో తేడాలున్నాయని రైతుల ఆరోపణ 

ఓ కంపెనీకి చెందిన విత్తనాలు వద్దన్నా అధిక ధరకు తమకు ఇచ్చా రని, సాగు చేసిన ఆ విత్తనాల్లోనే తేడాలున్నాయని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఇతర కంపెనీల మొక్కలు అన్నీ బాగున్నాయని, కానీ తాము ఎంచుకున్న కంపెనీ మొక్కల్లోనే తేడాలున్నాయని చెబుతున్నారు. చర్ల మండలంలో మొత్తం 600ఎకరాలకు ఈ విత్తనాలు కొనుగోలు చేశారని, అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. కనీసం విత్తనాలు ఇచ్చిన కంపెనీ కానీ ఉద్యాన శాఖ అధికారులు కానీ తమ సమస్యను పట్టించు కోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి సాగు చేశామని, తమను ఎవ్వరూ పట్టించుకోపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇప్పటికైనా పంటలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.



Updated Date - 2021-10-17T06:41:04+05:30 IST