మిర్రర్‌.. ది ఫిట్‌నెస్‌ ట్రైనర్‌

ABN , First Publish Date - 2021-11-14T16:30:02+05:30 IST

అద్దం.. అందం చూసుకోవడానికే కాదు.. ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుందట. ఈ స్మార్ట్‌ మిర్రర్‌ మీ రక్తపోటు మొదలు హార్ట్‌రేట్‌, రెస్పిరేటరీ రేట్‌, బ్లడ్‌ గ్లూకోజ్‌ కూడా మానిటర్‌ చేసి

మిర్రర్‌.. ది ఫిట్‌నెస్‌ ట్రైనర్‌

పర్సనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ గా మారిన స్మార్ట్‌మిర్రర్‌

నగర యువత ఆవిష్కరణ


హైదరాబాద్‌ సిటీ: అద్దం.. అందం చూసుకోవడానికే కాదు.. ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుందట. ఈ స్మార్ట్‌ మిర్రర్‌ మీ రక్తపోటు మొదలు హార్ట్‌రేట్‌, రెస్పిరేటరీ రేట్‌, బ్లడ్‌ గ్లూకోజ్‌ కూడా మానిటర్‌ చేసి చెప్పేస్తుందట. యోగా, హిట్‌, డ్యాన్స్‌ ఫిట్‌నెస్‌, ఎండ్యూరెన్స్‌ శిక్షణ మాత్రమే కాకుండా న్యూట్రిషన్‌ కోచింగ్‌ కూడా ఇస్తుందని చెబుతున్నారు పోర్టల్‌ స్మార్ట్‌ మిర్రర్‌ ఆవిష్కర్తలు ఇంద్రనీల్‌ గుప్తా, విశాల్‌ చందపేట. కరోనా కాలంలో ఫిట్‌గా ఉండాలనుకునే వారికి ఇది గొప్పగా దోహదపడుతుందని చెబుతున్నారు.


అన్ని రకాల వ్యాయామాలకూ..

కరోనా సమయంలో ఫిట్‌నెస్‌ పట్ల మక్కువ పెరిగింది. శిక్షణ కష్టాలు కూడా పెరిగాయి. అది దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ మిర్రర్‌కు రూపకల్పన చేశామన్నారు ఇంద్రనీల్‌ గుప్తా. ఫిట్‌నెస్‌ ప్రియుల సమస్త సమస్యలకూ ఇది పరిష్కారం చూపుతుందని పేర్కొంటున్నారు. శారీరక ఆరోగ్య పరంగా మాత్రమే కాదు మానసిక ఆరోగ్య పరంగా కూడా ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. యోగా భంగిమల్లోని లోపాలను కూడా సరిదిద్దుతుందని అంటున్నారు. ‘ఈ మిర్రర్‌ ముందు వేసే ప్రతి భంగిమనూ ఇది ట్రాక్‌ చేయడంతో పాటుగా దానిని సరిచేస్తుంది. అన్ని రకాల వ్యాయామాలకూ తోడ్పడుతుంది’ అని నమ్మకంగా చెబుతున్నారు.


పని తీరు ఇలా..

స్మార్ట్‌ మిర్రర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పని చేస్తుంది. రియల్‌ టైమ్‌లో ఇది ఓ వ్యక్తి మూవ్‌మెంట్‌, టెక్నిక్‌ను సరిచేస్తుంది. అదెలా సాధ్యమంటే దీనిలో ఉండే బయో సెన్సార్లు, హెచ్‌డీ కెమెరా, వై-ఫై లేదంటే బ్లూటూత్‌ కారణమని ఆవిష్కకర్తలు చెబుతున్నారు. ఇది చూడటానికి ఓ స్మార్ట్‌ టీవీలా ఉంటుంది. గోడకు ఫిట్‌ చేసుకోవడం లేదంటే ఎక్కడైనా నిల్చోపెట్టి దాని ముందు వ్యాయామాలు చేయడమే. దీంట్లో తీర్చిదిద్దిన సాఫ్ట్‌వేర్‌తో మీ శరీర కదిలికలను అనుక్షణం గమనించి తగిన సూచనలు చేస్తుందని వివరిస్తున్నారు. ఈ పోర్టల్‌ మిర్రర్‌లో ఉన్న సెన్సార్లతో ఈసీజీ, బ్లడ్‌ ప్రెషర్‌, శరీర ఉష్ణోగ్రత తదితర అంశాలనూ పరిశీలించవచ్చని ఆవిష్కర్తలు  వెల్లడిస్తున్నారు.  


ఫ్యామిలీ ట్రైనర్‌..

ఈ మిర్రర్‌ను కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దామని ఆవిష్కర్తలు అంటున్నారు. ఒక్క డివైజ్‌తో ఆరు ప్రొఫైల్స్‌లో శిక్షణ పొందవచ్చు. తొలుత ప్రమోషన్‌ ఆఫర్‌ తర్వాత చందా రూపంలో మొత్తం సేవలను వినియోగించే అవకాశం ఉంటుందట. డిసెంబర్‌లో అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని ఇంద్రనీల్‌ అంటున్నారు. తమ దగ్గర ఉన్న హై క్వాలిటీ ట్రైనర్లు అవసరమైన కంటెంట్‌ దీంట్లో రూపొందించారని, అవసరమైన వీడియోలు, న్యూట్రిషన్‌ అంశాలను కోరిన వారికి అందించే ఏర్పాట్లు చేస్తామని వివరిస్తున్నారు. తాను హైదరాబాద్‌ కుర్రాడినే అని చెప్పిన ఇంద్రనీల్‌, జెఎన్‌టీయు హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ తరువాత మాంచెస్టర్‌ బిజినెస్‌ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌ కోర్సు చేశానంటూ తన స్నేహితుడు, సహ వ్యవస్ధాపకుడు విశాల్‌తో  కలిసి నగరంలోనే పూర్తిగా ఈ ప్రొడక్ట్‌ డెవలప్‌ చేశామన్నారు. 

Updated Date - 2021-11-14T16:30:02+05:30 IST