ITR Filing : ఐటీఆర్ ఫైలింగ్ మిస్సయ్యారా?.. మీరు చేయాల్సింది ఇదే..

ABN , First Publish Date - 2022-08-01T21:58:14+05:30 IST

ఆఫీస్ బిజీ లేదా ఇతర కారణాల వల్ల జులై 31, 2022(నిన్న) లోగా ఐటీఆర్(Income Tax Return) ఫైలింగ్ చేయలేకపోయారా?.. అయితే

ITR Filing : ఐటీఆర్ ఫైలింగ్ మిస్సయ్యారా?..  మీరు చేయాల్సింది ఇదే..

న్యూఢిల్లీ: ఆఫీస్ బిజీ లేదా ఇతర కారణాల వల్ల జులై 31, 2022(నిన్న) లోగా ఐటీఆర్(Income Tax Return) ఫైలింగ్ చేయలేకపోయారా?.. అయితే ఏం కంగారు పడకండి. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం 2021-22కి సంబంధించిన ఐటీఆర్‌ను ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు దాఖలు చేయవచ్చు. అయితే జరిమానాగా ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా ఎంత ఉంటుంది, ఆలస్యంగా దాఖలు చేయడం వల్ల ప్రభావం ఏమిటనే అంశాలపై ఓ లుక్కేద్దాం..


జరిమానాలు ఇవే..

ఆలస్య రుసుము జరిమానా(Late Penalty)తో ఐటీఆర్ దాఖలు చేయొచ్చు. అయితే వార్షికాదాయం(Annual Income) రూ.5 లక్షల లోపు ఉంటే ఆలస్య రుసుము రూ.1000గా చెల్లించాలి. ఇక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువుంటే రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే చెల్లింపుదారుడి వార్షికాదాయం ‘ప్రాథమిక మినహాయింపు పరిమితి’ (Basic Exemption Limit) రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే ఎలాంటి జరిమానా కట్టాల్సిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్ల (senior citizens) విషయంలో ఈ మినహాయింపు పరిమితి రూ.3-5 లక్షల మధ్య ఉంది.


పన్ను చెల్లించవారికి వడ్డీ అదనం..

పన్ను చెల్లించనివారైతే జరిమానాతోపాటు ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234ఏ కింద పన్ను బకాయిలపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకుగానూ పన్ను బకాయిలలో 1 శాతం ఆలస్య రుసుము చెల్లించాలి. పన్ను బకాయిలు రూ.10 వేల కంటే తక్కువగా ఉంటే ఏప్రిల్ 1, 2022 నుంచే 1 శాతం జరిమానా వర్తిస్తుంది. ఇక పన్ను బకాయిలు రూ.10 వేల కంటే ఎక్కువగా ఉన్నా, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోయినా గడువు తేదీ తర్వాతి నెల నుంచి 1 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. నెలలో 5వ తేదీ తర్వాత పూర్తి ట్యాక్స్ చెల్లిస్తే.. ఆ నెలకు సంబంధించి పూర్తి స్థాయి వడ్డీ కట్టాలి.


పన్ను ప్రయోజనాలు దక్కవు..

చెల్లింపుదారులు ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే వీళ్లు పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం లేదు. ఉదాహరణగా చూసుకుంటే ‘లాస్ క్యారీఫార్వర్డ్‌’ అవకాశం ఉందలేరు. అంటే ప్రస్తుతం ఏడాది ‘నికర కార్యనిర్వహణ నష్టాలను’(ఎన్‌వోఎల్) రాబోవు సంవత్సరాల నికర ఆదాయంతో కలిపి చూపేందుకు వీలుండదు. దీంతో పన్ను భారాలను తగ్గించుకునే ఈ ప్రక్రియకు చెల్లింపుదార్లు దూరమవ్వక తప్పదు. కాబట్టి వ్యాపార ఆదాయం లేదా క్యాపిటల్ గెయిన్స్ లేదా ఇంటి ఆస్తిపై యజమానికి రూ.2లక్షల లోపు నష్టాన్ని క్యారీఫార్వర్డ్ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ గడువు కంటే ముందే ఫైలింగ్ చేసి ఉంటే క్యారీ ఫార్వర్డ్ నష్టాలను ఆర్థిక సంవత్సరం 2030-31 లేదా 8 సంవత్సరాల వరకు కొనసాగించే అవకాశం ఉంటుంది.


5.78 కోట్ల రిటర్నులు

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు డేటా ప్రకారం.. జులై 31 రాత్రి  11 గంటల సమయానికి 5.78 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. గత అంచనా ఏడాది నమోదయిన 5.9 కోట్ల రిటర్నుల కంటే ఈ సంఖ్య తక్కువగానే ఉంది.

Updated Date - 2022-08-01T21:58:14+05:30 IST