షాపింగ్‌ మాల్‌పై క్షిపణి.. 10 మంది సజీవ దహనం

ABN , First Publish Date - 2022-06-28T08:29:42+05:30 IST

ఉక్రెయిన్‌లో.. అత్యంత రద్దీగా ఉండే ఓ షాపింగ్‌ మాల్‌ను లక్ష్యంగా చేసుకున్న రష్యా క్షిపణుల వర్షం కురిపించింది.

షాపింగ్‌ మాల్‌పై క్షిపణి.. 10 మంది సజీవ దహనం

ఉక్రెయిన్‌లోని క్రెమెంచుక్‌ నగరంలో ఘటన
పూర్తిగా దహనమైపోయిన షాపింగ్‌ మాల్‌
మాల్‌లో వెయ్యి మంది.. మృతులు పెరిగే చాన్స్‌
ఎంతమంది చనిపోయారో తెలియదు: జెలెన్‌స్కీ
తూర్పు, దక్షిణ రీజియన్లపై రష్యా క్షిపణుల వర్షం

వెయ్యి మంది ఉన్న షాపింగ్‌ మాల్‌పై రష్యా మిసైల్స్‌

కీవ్‌, జూన్‌ 27: ఉక్రెయిన్‌లో.. అత్యంత రద్దీగా ఉండే ఓ షాపింగ్‌ మాల్‌ను లక్ష్యంగా చేసుకున్న రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. ఆ సమయంలో షాపింగ్‌ మాల్‌లో వెయ్యి మందిదాకా పౌరులు ఉన్నారు. క్షణాల్లో షాపింగ్‌మాల్‌ పూర్తిగా దహనమైపోయింది. లోపల ఎంత మంది ప్రాణాలతో ఉన్నారో తెలియదు..! కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి సాయం అందించేందుకు అగ్ని కీలలు అడ్డంకిగా మారాయి. లోపల అలుముకున్న దట్టమైన పొగతో ఊపిరి ఆడక కొందరు.. మంటల తీవ్రతకు మరికొందరు మృతిచెంది ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొల్టావా రీజియన్‌లోని క్రెమెంచుక్‌ నగరంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కడపటి వార్తలందేసరికి రెస్క్యూ బృందాలు 10 మృతదేహాలను వెలికితీశాయి. 40 మంది క్షతగాత్రులను క్షేమంగా బయటకు తీసుకొచ్చాయి. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని పొల్టావా గవర్నర్‌ దిమిత్రో ల్యూనిన్‌ వెల్లడించారు.

నిజానికి ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి కీవ్‌, తూర్పు, దక్షిణ, పశ్చిమ రీజియన్లనే టార్గెట్‌గా చేసుకుంది. మధ్య ప్రాంతంలో కీవ్‌ రీజియన్‌కు కిందివైపు.. జాపొరీజియాకు పైన ఉండే పొల్టావా మాత్రం సురక్షిత ప్రాంతంగా ఉంది. దీంతో.. అక్కడ పౌరులు నిర్భయంగా ఉన్నారు. షాపింగ్‌మాల్స్‌, థియేటర్లు యథావిధిగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే అతిపెద్దదైన క్రెమెంచుక్‌ షాపింగ్‌ మాల్‌ సోమవారం సాయంత్రం సుమారు వెయ్యి మంది వినియోగదారులతో కిటకిటలాడింది. జనాలు ఎక్కువగా ఉన్న సమయాన్ని చూసుకుని, రష్యా బాలిస్టిక్‌ గైడెడ్‌ క్షిపణులతో విరుచుకుపడిందని పొల్టావా గవర్నర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ టెలిగ్రామ్‌ ద్వారా స్పందించారు. ఇది అత్యంత దారుణమైన దాడి అని వ్యాఖ్యానించారు. దహనమవుతున్న షాపింగ్‌ మాల్‌ వీడియోలను ఆయన షేర్‌ చేశారు. దాడిలో ఎంతమంది చనిపోయారో తెలియదని పేర్కొన్నారు. కాగా, మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని రెస్క్యూ బృందాలు వెల్లడించాయి. లుహాన్స్క్‌లోని ఓ ఆయుధ డిపోను రష్యా సేనలు తగులబెట్టినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయ అధికారులు చెప్పారు. మారియుపోల్‌లో ఓ భవనం శిథిలాల కింద కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మరో 100 మృతదేహాలను వెలికితీసినట్లు పేర్కొన్నారు.  

Updated Date - 2022-06-28T08:29:42+05:30 IST