తప్పిపోయిన బాలిక.. తల్లి ఒడికి చేర్చిన టీవీ ప్రోగ్రామ్‌

ABN , First Publish Date - 2022-06-28T08:50:21+05:30 IST

దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. టీవీ ప్రోగ్రామ్‌ పుణ్యమాని తల్లిదండ్రుల ఒడికి చేరింది.

తప్పిపోయిన బాలిక.. తల్లి ఒడికి చేర్చిన టీవీ ప్రోగ్రామ్‌

2014లో గణేశ్‌ ఉత్సవాల్లో చిన్నారి మిస్సింగ్‌

ఫాదర్స్‌డే నాడు టీవీ కార్యక్రమంలో బాలికనుచూసి గుర్తించి ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా

అనాథాశ్రమం నుంచి వచ్చినట్టు వెల్లడి

అన్ని ఆధారాలతో అధికారుల ముందుకు తల్లి

బాలికను అప్పగించిన అధికారులు

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 27: దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. టీవీ ప్రోగ్రామ్‌ పుణ్యమాని తల్లిదండ్రుల ఒడికి చేరింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్‌కు చెందిన పిన్నమోని కృష్ణ, అనూరాధ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో ఇందు అనే చిన్నారి మూడున్నరేళ్ల వయసులో.. 2014 సెప్టెంబరు 3న వినాయకచవితి ఉత్సవాల్లో తప్పిపోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంత వెతికినా పాప ఆచూకీ లభించలేదు. ఇందు ఇక దొరకడం కష్టమని అందరూ అనుకున్నారు. బంధు మిత్రులు ఆమెను వెతకడం ఆపేశారు. కానీ.. తల్లి అనూరాధ మాత్రం పాప కోసం అన్వేషణను ఆపలేదు.  అయినా పాప ఆచూకీ లభించలేదు. అనుకోకుండా.. జూన్‌ 19న ఫాదర్స్‌డే సందర్భంగా ఈటీవీలో ప్రసారమైన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమానికి వచ్చిన వీక్షకుల్లో ఒక పాప తమ కుమార్తెలాగానే కనిపించడంతో కృష్ణ, అనూరాధ దంపతులు అప్రమత్తమయ్యారు. విశ్వప్రయత్నం చేసి ఆ కార్యక్రమంలో పాల్గొన్న వీక్షకులు ఎక్కడి నుంచి వచ్చారో ఆరా తీయగలిగారు. కిస్మత్‌పూర్‌లో చెరిష్‌ అనే అనాథ బాలల సంరక్షణ కేంద్రం నుంచి వచ్చినట్టు తెలుసుకుని రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ అధికారుల సాయంతో అక్కడికి వెళ్లారు. అక్కడ ఆ బాలికను చూసిన అనూరాధ.. ఆమే తన కుమార్తె అని గుర్తించారు. ఆ పాప తన పాపే అని.. అందుకు సంబంధించిన అధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పి.. తగిన ఆధారాలతో జిల్లా బాలల సంరక్షణ కమిటీ అధికారులను సంప్రదించారు. వారు ఆ పత్రాలన్నీ పరిశీలించి.. తప్పిపోయిన ఇందు, ఈ పాప ఒక్కరే అని నిర్ధారణకు వచ్చారు. జేజే ఆక్ట్‌ -2015 ప్రకారం ఆ పాపను సోమవారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌, సభ్యులు, ఇతర అధికారుల ముందు తల్లిదండ్రులకు అప్పగించారు. ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయిన పాపను తల్లిదండ్రులకు అప్పగించడం ఆనందం కలిగించిందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్‌పర్సన్‌ శ్రీనివా్‌సరావు అన్నారు.

Updated Date - 2022-06-28T08:50:21+05:30 IST