మిస్సింగ్..!

ABN , First Publish Date - 2022-05-18T17:30:51+05:30 IST

ఆమె ఐదు నెలల గర్భిణి. ఆస్పత్రిలో చూపించుకుని పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి కనిపించకుండా పోయింది. వనస్థలిపురం

మిస్సింగ్..!

నగరంలో నెలకు వెయ్యి అదృశ్యం కేసులు

ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ, గృహ హింసతో.. 

 ఇళ్లు విడిచిపోతున్న వైనం

హైదరాబాద్‌ సిటీ: ఆమె ఐదు నెలల గర్భిణి. ఆస్పత్రిలో చూపించుకుని పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి కనిపించకుండా పోయింది. వనస్థలిపురం పోలీ్‌సస్టేషన్‌లో రెండు రోజుల క్రితం కేసు నమోదైంది. 

 ఆడుకోవడానికి బయటకు వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైన ఘటన చాంద్రాయణగుట్టలో సోమవారం చోటు చేసుకుంది. 

 మీర్‌పేట లెనిన్‌నగర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు  సోమవారం మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ట్రై కమిషనరేట్‌ పరిధిలో రోజూ పదుల సంఖ్యలో మిస్సింగ్‌ కేసులు నమోదవుతున్నాయి. పోలీసుల గణాంకాల ప్రకారం ప్రతీ కమిషనరేట్‌ పరిధిలో రోజుకు సుమారు 10-15 కేసులు నమోదువుతున్నాయి. ఈ లెక్కన ప్రతి నెలా నగరంలో మిస్సింగ్‌ కేసుల సంఖ్య 900-1000 వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది. 


పోలీసుల హైరానా

అదృశ్యం కేసులు అటు కుటుంబ సభ్యులను, పోలీసులను కలవరపెడుతున్నాయి. మిస్సింగ్‌ కేసులను ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. సంఖ్య ఎక్కువగా ఉండటంతో హైరానా పడుతున్నారు. యువతులు, చిన్నారుల మిస్సింగ్‌ కేసులు ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. కుటుంబ సభ్యుల వద్ద సేకరించిన సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొన్ని కేసుల్లో అదృశ్యమైన వారు తిరిగి ఇంటికి చేరినా సమాచారం ఇవ్వకపోవడంతో గాలిస్తూనే ఉంటున్నామని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


చిన్న కారణాలతోనే..

అదృశ్యం అవుతున్న కేసుల్లో 98 శాతం చిన్న కారణాలతోనే ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్లు పోలీసులు పేర్కొంటు న్నారు. ప్రేమ వ్యవహారం, అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని  యువతీ యువకులు ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్లు వెల్లడించారు. ఇంట్లోంచి వెళ్లిపోతున్న మహిళలు, పిల్లలను తీసుకొని వెళ్తున్న వారిలో గృహ హింస, భర్త కుటుంబ సభ్యుల వేధింపులు ఉంటున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ గొడవల కారణంగా మరికొందరు ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. కొందరు కొన్ని రోజుల తర్వాత పోలీసులకు, కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి అప్పుల వాళ్లకు భయపడి వేరే ప్రాంతంలో బతుకుతున్నట్లు పేర్కొంటున్నారు. 

Updated Date - 2022-05-18T17:30:51+05:30 IST