మాయమైన రెవెన్యూ రికార్డులు ఇక రానట్టేనా ?

ABN , First Publish Date - 2021-06-21T06:55:30+05:30 IST

లింగసముద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఎనిమిదేళ్ల క్రితం మాయమైన రెవెన్యూ రికార్డులు నేటికీ అతీగతీ లేదు.

మాయమైన రెవెన్యూ రికార్డులు ఇక రానట్టేనా ?
లింగసముద్రం తహసీల్దార్‌ కార్యాలయం

మూడు గ్రామాల ఎఫ్‌ఎల్‌ఆర్‌లు, 13 గ్రామాల సర్వే రికార్డులు మాయం

2016లో వాటిని తెప్పించాలని జిల్లా కలెక్టర్‌కు లేఖ

ఇదే అదునుగా పదేళ్ల నుంచి అక్రమాలకు పాల్పడుతున్న అక్రమార్కులు

లింగసముద్రం, జూన్‌ 20 : లింగసముద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఎనిమిదేళ్ల క్రితం మాయమైన రెవెన్యూ రికార్డులు నేటికీ అతీగతీ లేదు. జిల్లాలోని సర్వే, ల్యాండ్‌ రికార్డుల కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి తెప్పించకపోవడంతో వాటి కథ కంచికేనా?అని ప్రజలు అనుమానిస్తున్నారు. రికార్డులు లేకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. భూమాఫియాలకు పాల్పడుతున్నారు. అంతేగాక సాధారణంగా తలెత్తే భూసమస్యలను పరిష్కరించలేక అధికారులు అల్లాడిపోతున్నారు.

తహసీల్దార్‌ కార్యాలయంలో 13 గ్రామాలకు చెందిన సర్వే నంబర్ల రికార్డులు, మూడు గ్రామాల ఎఫ్‌ఎల్‌ఆర్‌ల రికార్డులు కనిపించడం లేదని 2013లో అప్పటి రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ రికార్డులను వెంటనే తెప్పించేందుకు అప్పటి అధికారులు ప్రయత్నించగా 2014లో ఎన్నికలు రావడంతో వీలు కాలేదు. 2016లో అప్పటి తహసీల్దార్‌ కనిపించని రికార్డుల జాబితాను అప్పటి సర్వే, ల్యాండ్‌ రికార్డుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు, జిల్లా కలెక్టర్‌కు లెటర్‌ రాశారు. 

గ్రామాల వారీగా కనిపించని రికార్డుల వివరాలు

వీఆర్‌కోట, చెరువురాజుపాలెం, రాళ్లపాడు గ్రామాల ఎఫ్‌ఎల్‌ఆర్‌ రికార్డులు కార్యాలయంలో కనిపించడంలేదు. సుమారు 13 గ్రామాలలో సర్వే రికార్డులదీ అదే పరిస్థితి. విశ్వనాథపురంలో స.నం.2/3 నుంచ 124/2 వరకు మధ్యలోని సుమారు 68 స.నం.లు, తూర్పు రాజుపాలెంలో 136 నుంచి 139 వరకు, మాలకొండరాయునిపాలెంలో 324/2 నుంచి 375/3 వరకు మధ్యలో 47, పెంట్రాలలో 5 నుంచి 141 వరకు మధ్యలో 22, చీమలపెంటలో 1 నుంచి 10 వరకు, రాళ్లపాడులో 1 నుంచి 178 వరకు, అన్నెబోయినపల్లిలో 125 నుంచి 150 వరకు, 170 నుంచి 180 వరకు, ముత్యాలపాడులో 286 నుంచి 835 వరకు మధ్యలో 13, లింగసముద్రంలో 1 నుంచి 105, 154 నుంచి 168, 242 నుంచి 296 వరకు, గంగపాలెంలో 157/1 నుంచి 170, 308 నుంచి 317 వరకు, తిమ్మారెడ్డిపాలెంలో 63/10 నుంచి 359/10 వరకు మధ్యలో 48, వెంగళాపురంలో 106/2 నుంచి 214 వరకు మధ్యలో 28, జంగంరెడి కండ్రికలో 5/4 నుంచి 99/3 వరకు మధ్యలో 47 సర్వే నంబర్లకు సంబంధించిన రికార్డులు కనిపించడం లేదని వాటిని తెప్పించాలని, అప్పటి రెవెన్యూ అధికారులు రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు లేఖ రాసినా నేటికీ అవి కార్యాలయానికి రాలేదు.

అక్రమాలకు తెరలేపిన అధికారులు, నాయకులు

కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు మాయం కావడంతో పదేళ్ల క్రితం నుంచి అప్పటి కొందరు అధికారులు, నేతలు పలు అక్రమాలకు తెరలేపారు. వీటిని ఆసరాగా చేసుకొని దొంగ పాస్‌ పుస్తకాలు సృషించి, వాటిని అక్రమ పద్ధతులలో ఆన్‌లైన్‌ చేసుకొని పలు బ్యాంకులలో కోట్లాది రూపాయల రుణాలు పొందారని తీవ్ర ఆరోణలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికైనా ఈ రికార్డులు వచ్చేనా అని ఆయా గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2021-06-21T06:55:30+05:30 IST