సినిమా రివ్యూ : మిషన్ ఇంపాజిబుల్

Published: Fri, 01 Apr 2022 13:53:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ : మిషన్ ఇంపాజిబుల్

చిత్రం : మిషన్(మిషాన్) ఇంపాజిబుల్ 

విడుదల తేదీ : ఏప్రిల్ 1, 2022

నటీనటులు : తాప్సీ పన్ను, రవీంద్ర విజయ్, సత్యం రాజేష్, హరీశ్ పేరడి, హర్షవర్ధన్, రంగధామ్, రిషబ్ షెట్టి, మాస్టర్ హర్ష రోషన్, భాను ప్రకాశన్ తదితరులు.

సంగీతం : మార్క్ కె రాబిన్

ఎడిటింగ్ : రవితేజ గిరిజాల

సినిమాటోగ్రఫీ : దీపక్ యరగెర

నిర్మాణం : మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ 

దర్శకత్వం : స్వరూప్ ఆర్.యస్.జె 

‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు స్వరూప్ ఆరె.యస్.జే. రెండో ప్రయత్నంగా ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిత్రాన్ని మలిచాడు. హాలీవుడ్ ఫేమస్ టైటిల్‌తో, బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ అనిపించుకున్న తాప్సీ ప్రధాన పాత్రలో, ముగ్గురు కుర్రాళ్ళతో తెరకెక్కిన ఈ సినిమా నేడే (శుక్రవారం) థియేటర్స్ లోకి వచ్చింది. మరి స్వరూప్ తన తొలి చిత్రంలాగానే ఈ సినిమాని కూడా ఆసక్తిగా మలిచాడా? అసలు ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పిస్తుంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ

శైలు (తాప్సీ) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. చైల్డ్ ట్రాఫికింగ్‌పై పరిశోధనలు చేస్తుంటుంది. రామ్ శెట్టి (హరీశ్ పేరడి) అనే మాఫియా డాన్  బెంగళూర్ నుంచి భారీ ఎత్తున పిల్లల్ని దుబాయ్‌కి తరలించడానికి స్కెచ్ వేస్తాడు. దాన్ని ఎలాగైనా అడ్డుకొని రామ్ శెట్టిని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టివ్వాలన్నది శైలు ఆలోచన. మరోవైపు తిరుపతి దగ్గరున్న వడమాలపల్లి అనే గ్రామానికి చెందిన రఘుపతి, రాఘవ, రాజారామ్ అనే పదకొండేళ్ళ కుర్రాళ్లు అందరికన్నా బాగా ఫేమస్ అయిపోవాలన్న ఆశతో  ఉంటారు. అందుకోసం పెద్ద ఎత్తున డబ్బు కూడబెట్టాలనుకుంటారు. దావూద్ ఇబ్రహిమ్‌ను పట్టిస్తే రూ.50 లక్షలిస్తారని తెలుసుకొని  ముంబై అనుకొని బెంగళూర్ పారిపోతారు. వాళ్ళు ఆ మిషన్‌కు పెట్టుకొన్న పేరే మిషన్ ఇంపాజిబుల్. అయితే బెంగళూర్‌లో రామ్ శెట్టి ప్రయత్నాన్ని భగ్నం చేయాలనుకున్న శైలుకి.. దావూద్ ఇబ్రహిం కోసం బెంగళూర్ చేరిన ముగ్గురు కుర్రాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు? శైలు మిషన్‌కు, ఆ ముగ్గురికీ సంబంధమేమిటి? చివరికి ఇంపాజిబుల్ మిషన్.. పాజిబుల్‌గా మారిందా? అందులో వారు విజయం సాధించారా లేదా అన్నది మిగతా కథ. 

విశ్లేషణ 

దర్శకుడు స్వరూప్ మొదటి చిత్రం అనాథ శవాలు, వాటి వేలు ముద్రల చుట్టూ అల్లు కొన్న స్కామ్ నేపథ్యంలో, గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లేతో, కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులు ఊహించని రీతిలో డిజైన్ చేసుకొన్న కథాంశంతో రూపొంది ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టేసింది. తొలి ప్రయత్నంతోనే ఆ దర్శకుడిలో ఎంత వర్త్ ఉందో అందరికీ అర్థమైంది. దాంతో అతడి రెండో చిత్రంపై ఆటోమ్యాటిగ్గా ఆసక్తి నెలకొంది. ఇది కూడా ఓ స్కామ్ నేపథ్యంలో సాగుతుందని ట్రైలర్‌ను బట్టి అర్థమైంది. అయితే తొలి చిత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చూసిన వారికి నిరాశ తప్పదు. చైల్డ్ ట్రాఫికింగ్ లాంటి ఓ సీరియస్ మిషన్‌ను ఓ ముగ్గురు చిన్నపిల్లల చేతుల్లో పెట్టడంతో తాప్సీ పాత్రకు అర్థం లేకుండా పోయింది. ఆ పాత్రకు తాప్సీ ఎందుకు? ఏ అనసూయనో పెడితే సరిపోతుంది కదా అనిపిస్తుంది. పోనీ ముగ్గురు పిల్లలతో ఆ మిషన్‌ను కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు వారిలో అమోఘమైన తెలివితేటలున్నాయని చూపించాలి కదా.. అలా జరగలేదు. ఆ ముగ్గురినీ బుర్రలేని కుర్రాళ్ళలా ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు దర్శకుడు. అంతేకాదు ఒకసారి వాళ్ళని హైలీ ఇంటెలిజెంట్స్‌లా, ఒకసారి పూర్తిగా తెలివి తక్కువవాళ్ళలా చూపించారు. దాంతో ఆ ముగ్గురు కుర్రాళ్ళూ ఎంతలా పెర్ఫార్మ్ చేసినప్పటికీ అందులో ఎంతో కొంత వెలితి కనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా ముగ్గురు కుర్రాళ్ళ బ్యాక్ డ్రాప్‌లో సరదా సరదాగా సాగిపోతుంది చిత్రం. ఆ ముగ్గురి అమాయకత్వానికి నవ్వొస్తుంది. సినిమాలో వినోదం అంటూ ఉందంటే.. ప్రథమార్ధంలోనే.


ఇక ద్వితీయార్ధం నుంచి అసలు మిషన్ స్టార్ట్ అవుతుంది. ఆ క్రమంలో పూర్తిగా లాజిక్కుల్ని పక్కన పెట్టి.. సీరియస్ మేటర్‌ను సిల్లీగా డీల్ చేశాడు దర్శకుడు. ముగ్గురు పిల్లల కష్టాలు, డాన్ వ్యవహారం, వారి ప్లాన్స్, తాప్సీ స్కెచెస్, చైల్డ్ ట్రాఫికింగ్ బోర్ కొట్టిస్తాయి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన తాప్సీ ఒక దశలో సిఐడీ ఆఫీసరైపోతుంది. ఆమె ఆర్డర్స్‌ను పోలీసులు ఫాలో అవడం సిల్లీ అనిపిస్తుంది. ముగ్గురు పిల్లలు తెలియని తనంతో ఒక మిషన్‌ను సక్సెస్ చేయడం అనేది..  కాన్సెప్ట్ వరకూ ఓకే కానీ.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడని చెప్పాలి. 


ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా తాప్సీ ఓకే అనిపిస్తుంది. ఇందులో ఆమె చేసిందేమీ లేదు. సినిమాని అంతా ముగ్గురు కుర్రాళ్ళే భుజాన వేసుకున్నారు. ఆ ముగ్గురూ పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టారు. సినిమా డైరెక్టర్స్‌ను వాళ్ళ పేర్లతో దేవుళ్ళగా చూపించడం, కౌన్ బనేగా కరోడ్ పతి ఇంట్రో ట్రయల్ షూట్, ఆ ముగ్గురి అమాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ మెప్పిస్తాయి. మలయాళ నటుడు హరీశ్ పేరడి విలనిజం ఆకట్టుకుంటుంది. రవీంద్ర విజయ్ యాక్టింగ్ కూడా మెప్పిస్తుంది. సినిమా నిర్మాణ విలువలు, సంగీతం ఆకట్టుకుంటాయి. లాజిక్కులు పక్కనపెట్టి .. ఇందులోని కొన్ని కామెడీ సీన్స్, పిల్లల పెర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.

ట్యాగ్‌లైన్ : లాజిక్స్ ఇంపాజిబుల్

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International