ఉపశమన చర్యలు

ABN , First Publish Date - 2022-05-24T06:25:45+05:30 IST

పెట్రో మంటనుంచి ఎంతోకొంత ఊరట లభించినందుకు ప్రజలు సంతోషిస్తున్నారు. ఇది ప్రభుత్వం తనకుతానుగా తీసుకున్న నిర్ణయం అనేకంటే, హెచ్చుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి...

ఉపశమన చర్యలు

పెట్రో మంటనుంచి ఎంతోకొంత ఊరట లభించినందుకు ప్రజలు సంతోషిస్తున్నారు. ఇది ప్రభుత్వం తనకుతానుగా తీసుకున్న నిర్ణయం అనేకంటే, హెచ్చుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఓ తప్పనిసరి మార్గమని కూడా గుర్తించాలి. ద్రవ్యోల్బణం, ఆర్థికమందగమనం ఇత్యాది భయాలతో మొన్న గురువారం స్టాక్ మార్కెట్ రెండునెలల్లోనే మరో పెద్ద పతనాన్ని చవిచూసింది. విదేశీ మదుపుదారుల వరుస విక్రయాలు, రూపాయి క్షీణత వంటివి కూడా ఇందుకు తోడైనాయి. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూండటంతోపాటు, పెరుగుతున్న ద్రవ్బోల్బణం వల్ల కూడా భారత వృద్ధిరేటును అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ ఇటీవల సవరించింది. మూడునెలల క్రితం ఈ ఆర్థిక సంవత్సరంలో 7.8శాతం వృద్ధిరేటును అంచనా కట్టిన ఈ సంస్థ నియంత్రణలో లేని ద్రవ్యోల్బణం ఉత్పత్తిపైనా, ఉపాధి కల్పనపైనా తీవ్రప్రభావం చూపుతుందన్న హెచ్చరికలతో వృద్ధిరేటు అంచనాను 7.5శాతానికి కుదించిన విషయం తెలిసిందే. 


పప్పు, ఉప్పు, సబ్బు, నూనె ధరలు ఆకాశాన్నంటి అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కాస్తంత ఉపశమనం ఇస్తుంది. నిత్యావసరాల ధరల పెంపునకు, తద్వారా ద్రవ్బోల్బణానికి ఆజ్యం పోస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరలకు కళ్ళెం వేయడంపైన ఇప్పటికైనా దృష్టిపెట్టినందుకు సంతోషించాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు గతంలో ఎన్నడూ లేనిస్థాయికి చేరడంతో దాని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతూ వస్తోంది. టోకు, రిటైల్ ద్రవ్బోల్బణాలు ఎనిమిదేళ్ళ రికార్డును బద్దలు కొట్టాయి. సిమెంటు, స్టీలు ధరలు పెరిగి గృహనిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది, ఉపాధి పడిపోతున్నది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం దిద్దుబాటుచర్యలకు ఉపక్రమించింది. పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకంలో కోత ప్రకటించిన వెంటనే, తమ ప్రభుత్వానికి ప్రజలే ప్రథమం అని ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ పెట్రో ధరలు తగ్గడం వల్ల వివిధ రంగాలపై సానుకూల ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చారు. ప్రజల జీవనాన్ని ఈ నిర్ణయం మెరుగుపరుస్తుందనీ, ముఖ్యంగా ఉజ్వల గ్యాస్ రాయితీ పేద మహిళలకు మేలు చేస్తుందనీ అన్నారాయన. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఇదే అవకాశంగా తమ ప్రభుత్వాన్నీ, మోదీని ప్రశంసల్లో ముంచెత్తుతూ ఈ నిర్ణయం ద్వారా ప్రజలకోసం తాము లక్షకోట్లమేరకు వదులుకుంటున్నామన్నారు. పాలకులుగా ఈ స్వభుజతాడనం వారికి తప్పనిపించకపోవచ్చును కానీ, పెట్రోధరల విషయంలో వారు తమను ఏ మేరకు వంచిస్తున్నదీ ప్రజలకు తెలియకపోదు. రెండు ఇంధనాల పెరిగిన ధరలనూ ఇప్పుడు తగ్గించినదానితో పోల్చిచూడక మానరు. కేవలం గత రెండునెలల్లో పెరిగిన దానితో పోల్చినా ఇప్పుడు తగ్గింది కొంచెమే. గత ఏడాది నవంబరులోనూ, ఇప్పుడూ కోతవేసిన ఎక్సైజ్ సుంకాన్ని కలిపి లెక్కవేసుకున్నా పాలకులు పొందుతున్నదానికంటే విదల్చింది తక్కువే. 


రాష్ట్రాలు కూడా తమలాగే ఉదారంగా వ్యవహరించాలని నిర్మల అంటున్నారు. తాము ప్రదర్శించిన ఔదార్యంలో రాష్ట్రాల వాటా కూడా ఉన్నదనీ, తాము వదులుకుంటున్నదానిలో కొంతభాగం వాటికి చెందాల్సినదేననీ ఆమెకు తెలియకపోదు. నిజానికి పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం భారీగా వసూలు చేస్తున్నా రాష్ట్రాలకు ఇచ్చే వాటా స్వల్పంగానే ఉంటున్నది. సదరు ఎక్సైజ్ డ్యూటీని మూడు ముక్కలు చేసి, బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ కింద వసూలు చేస్తున్న దానిని మాత్రమే రాష్ట్రాలకు పంచుతున్నది. మొత్తం వసూలైన సుంకాల్లో రాష్ట్రాలకు దక్కుతున్నది దాదాపు ఐదున్నరశాతమే. ద్రవ్బోల్బణం నియంత్రణకు గోధుమల ఎగుమతులపై విధించిన నిషేధం కూడా ఉపకరిస్తుందని ఓ అంచనా. గోధుమధరలు పదిశాతం పెరిగినా ద్రవ్బోల్బణంమీద దాని ప్రభావం బాగానే ఉంటుంది. అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినప్పటికీ, ఎగుమతులపై నిషేధం విధించకుండా ధరలను అరికట్టడం, ద్రవ్బోల్బణాన్ని నియంత్రించడం, కష్టమని ప్రభుత్వం భావించినట్టుంది. రెపోరేటుపై ఆర్బీఐ నిర్ణయం కూడా సరైన సమయంలో తీసుకున్న సానుకూల నిర్ణయమే. సిమెంటు, స్టీల్ ధరల నియంత్రణకు ప్రభుత్వం శ్రద్ధపెట్టడం ద్రవ్యోల్బణం నియంత్రణతో పాటు పేద, మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం కలిగిస్తుంది.

Updated Date - 2022-05-24T06:25:45+05:30 IST