‘జేఎస్‌డబ్ల్యూ’ చేతికి మిత్రా ఎనర్జీ ఆస్తులు

ABN , First Publish Date - 2022-08-11T09:25:33+05:30 IST

‘జేఎస్‌డబ్ల్యూ’ చేతికి మిత్రా ఎనర్జీ ఆస్తులు

‘జేఎస్‌డబ్ల్యూ’ చేతికి మిత్రా ఎనర్జీ ఆస్తులు

ఒప్పందం విలువ రూ.10,530 కోట్లు 


న్యూఢిల్లీ: దేశీయ పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్‌ ఎనర్జీ) రంగంలో భారీ డీల్‌ కుదిరింది. హైదరాబాద్‌ కంపెనీ మిత్రా ఎనర్జీ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 1,753 మెగావాట్ల రెన్యూవబుల్‌ ఎనర్జీ ఆస్తులను రూ.10,530 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు జేఎ్‌సడబ్యూ ఎనర్జీ లిమిటెడ్‌ బుధవారం ప్రకటించింది. తన అనుబంధ విభాగమైన జేఎ్‌సడబ్ల్యూ నియో ఎనర్జీ ద్వారా ఈ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. జేఎ్‌సడబ్ల్యూ ఎనర్జీకి ఇప్పటివరకిదే అతిపెద్ద కొనుగోలు. అయితే కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)తో పాటు తదితర అనుమతులకు లోబడి ఈ లావాదేవీ పూర్తికానుంది. ఈ కొనుగోలుతో జేఎ్‌సడబ్ల్యూ ఎనర్జీ విద్యుదుత్పత్తి సామర్థ్యం ప్రస్తుతమున్న 4,780 మెగావాట్ల నుంచి 6,530 మెగావాట్లకు చేరుకోనుంది. మరో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన పవన విద్యుత్‌, సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని, వచ్చే 18-24 నెలల్లో వీటి నుంచీ ఉత్పత్తి ప్రారంభం కావచ్చని జేఎ్‌సడబ్ల్యూ పేర్కొంది. దీంతో మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 9,100 మెగావాట్లకు చేరుకోనుందని, పునరుత్పాదక ఇంధన వాటా 65 శాతానికి చేరుకోనుందని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 10,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని జేఎ్‌సడబ్ల్యూ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతకు ముందే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ డీల్‌ దోహదపడనుందని కంపెనీ పేర్కొంది. భవిష్యత్‌లో మరిన్ని కొనుగోళ్లు చేపట్టాలనుకుంటున్నట్లు, సరైన ఆస్తుల కోసం అన్వేషణ కొనసాగుతుందని జేఎ్‌సడబ్ల్యూ ఎనర్జీ సీఈఓ, జాయింట్‌ ఎండీ ప్రశాంత్‌ జైన్‌  తెలిపారు. 


మిత్రా గురించి.. 

2009లో ఏర్పాటైన మిత్రా ఎనర్జీకి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు సహా దేశంలోని 9 రాష్ట్రాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులున్నాయి. కంపెనీ పోర్ట్‌ ఫోలియోలో 1,330 మెగావాట్ల పవన విద్యుత్‌ (విండ్‌ ఎనర్జీ) ఆస్తులతో పాటు 422 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ఆస్తులున్నాయి. నిధుల కొరత కారణంగా కంపెనీ ఆస్తుల విక్రయం కోసం మిత్రా ఎనర్జీ మూడేళ్లకు పైగా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పలు ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లు, వ్యూహాత్మక కొనుగోలుదారులతో చర్చలు జరిపింది. కంపెనీకి చెందిన 21 శాతం విద్యుదుత్పత్తి ఆంధ్రప్రదేశ్‌ నుంచే జరుగుతోంది. తొలుత ఒప్పందం చేసుకున్న రేటు కంటే తక్కువకు విద్యుత్‌ను విక్రయించేలా ఏపీ ప్రభుత్వం..కంపెనీతో పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (పీపీఏ)ను సవరించింది. దాంతో కంపెనీకి కష్టాలు మరింత పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి డిస్కమ్‌ల నుంచి కంపెనీకి రావాల్సిన మొత్తం బకాయిలు రూ.1,876 కోట్లుగా నమోదు కాగా.. అందులో ఏపీ వాటా 45 శాతం, తెలంగాణ వాటా 35 శాతంగా ఉంది. మిత్రా ప్రాజెక్టులకు రావాల్సిన బకాయిల రికవరీ కోసం ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదిస్తామని జేఎ్‌సడబ్ల్యూ ఎనర్జీ సీఈఓ ప్రశాంత్‌ తెలిపారు. ఏపీ ఇప్పటికే తొలి విడతగా మొత్తం బకాయిల్లో 10 శాతాన్ని చెల్లించిందని, మిగతా మొత్తాన్ని 12 నెలల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు.  

Updated Date - 2022-08-11T09:25:33+05:30 IST