జీవభాషను ‘దేవభాష’తో కలపొద్దు!

ABN , First Publish Date - 2021-07-22T08:34:05+05:30 IST

కొన్నిసందర్భాలలో చేయకూడని రెండు పనులు కలిపి చేసినప్పుడు పేడ - బెల్లం కలిపినట్లు అంటారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమీని...

జీవభాషను ‘దేవభాష’తో కలపొద్దు!

కొన్నిసందర్భాలలో చేయకూడని రెండు పనులు కలిపి చేసినప్పుడు పేడ - బెల్లం కలిపినట్లు అంటారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమీని తెలుగు-సంస్కృత అకాడమీగా కలపడం కూడా అలాంటిదే అని ఎవరైనా అంటే ఆయా భాషాభిమానులు బాధ పడనక్కర్లేదు. సంస్కృతాన్ని కించపరిచినట్లు కూడా అనుకోవద్దని మనవి. ఎందుకంటే దేని పని దానిది, దేని పరిధి దానిది. చెరుకు తోటకు పేడను ఎరువుగా వేస్తే అది ఏపుగా పెరిగి మనకు చెరుకురసాన్ని ఇచ్చి తద్వారా బెల్లం తయారీకి దోహదపడుతుంది. ఆ విధంగా పేడకు - బెల్లానికి జీవ బంధం ఉంటుంది. కానీ, ఆ రెండింటినీ వినియోగించాల్సిన సందర్భాలు సమయాలు వేరువేరు గదా.


మనకు తెలుగులో ఊపిరితిత్తులు అంటారు. దాన్నే సంస్కృతంలో శ్వాసకోశం అంటారు. ‘శ్వాసతిత్తులు’, ‘ఊపిరికోశం’ అనే పదాలు లేవు. తెలుగు పదాన్ని సంస్కృత పదాన్ని కలిపి సర్వ సాధారణంగా సంధి చేయకూడదు అని చిన్నప్పుడు బడుల్లో తెలుగు పంతుళ్లు చెప్పారు. తెలుగు అకాడమీని సంస్కృత అకాడమీని కలపటం అంటే ఇలాంటిదే. ఈ ప్రభుత్వాలకు నిజంగా మాతృభాష పట్ల గాని, మన తెలుగుపై చాలా ప్రభావాన్ని కలిగించిన సంస్కృతం పట్ల గాని నిజమైన అభిమానం ఉంటే వాటి వాటి విభిన్న స్వరూప స్వభావాల చలన ప్రవృత్తి ప్రకారం వాటిని విడి విడిగా అభివృద్ధి కానివ్వడమే మంచిది.


‌తెలుగు తప్ప మరొక భాష రాని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. సంస్కృతం తప్ప మరొక భాష రాని వాళ్ళు ఎందరుంటారు? బహుశా 10లక్షలలో ఒకరు కూడా ఉండరేమో! కారణం ఏమై ఉంటుంది? దీనికి జవాబు కోసం ‌మరో ప్రశ్న వేసుకోవాలి. ఈ రోజున మనకు సంస్కృతం అని బోధించేది ఏనాడైనా ఏదో ఒక ప్రాంతంలో ప్రజల భాషగా ఉండిందా? కొందరు భాషా శాస్త్రజ్ఞులు ఏమంటారంటే, అనేక ప్రాకృత భాషల పదాలను సంస్కరించి కూర్చిన పుస్తక భాష సంస్కృతం అంటారు. అది పండిత భాషగా లేక రాజాస్థానాల భాషగా మాత్రమే ఉండింది కానీ ప్రజల నిత్యజీవిత వ్యవహార భాషగా ఉన్నట్లు తగిన ఆధారాలు లేవంటారు. ఏ కాలంలోనైనా ఏ ప్రాంతంలోనైనా సంస్కృతం ప్రజల భాషగా ఉండినదని మాటవరసకి ఒప్పుకున్నా, అది కూడా వందలాది సంవత్సరాల క్రితం మాటే గాని ఇటీవలి కాలానిది కాదు. కనుక కేవలం కొద్దిమంది పండితులకూ, చరిత్ర పరిశోధకులకూ మాత్రమే ఉపయోగపడే భాషగా సంస్కృతం ఉందే కానీ, ఏ స్థాయి ప్రజలకూ అది నిత్యజీవిత వ్యవహారిక భాషగా లేదు. భాషాశాస్త్ర అర్థంలో ఒక్కమాటలో చెప్పాలంటే అది మృతభాషగా మాత్రమే ఉంది. జీవ భాషగా లేదు. అయితే అనేక కాలం చెల్లిన భావజాలాల కారణంగా సంస్కృతం మృతభాష అంటే బాధపడేవాళ్ళు కొందరైనా ఉంటారు. వారికి వాస్తవం మీద కంటే భావోద్వేగాలను సంతృప్తి పరుచుకోవడం మీద ఎక్కువ ఆసక్తి.


తెలుగు ఇంకా మృతభాష కాలేదు. అందుకు ఋజువు కోట్లమంది నిత్యజీవిత అవసరాలకు ఉపయోగపడే సాధనంగా అది నేటికీ ఉండటం! ‌అంతేకాదు కొత్త కొత్త పదాల, పదబంధాల, పదజాలాల సృష్టి కూడా ఇంకా సాగుతూ ఉండటం. ఈ రెండూ జీవభాషకు ముఖ్యమైన ప్రాతిపదికలు. అయితే, తెలుగును కొత్త తరాల ఉపాధి అవసరాలకు పనికిరాని భాషగా, గడచిన నలభై సంవత్సరాలుగా, పాలకులు పనిగట్టుకుని దిగజారుస్తున్నారు కనుక, దాని భవిష్యత్తు ప్రమాదకరంగా మారిన మాట నిజం. అంతేగాక ఐక్యరాజ్యసమితి అంతరించిపోతున్న భాషలకు ఇచ్చిన కొన్ని ప్రాతిపదికల ప్రకారం తెలుగు కూడా అంతరించిపోయే క్రమంలో ఉన్నట్టు భావించాలి. ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గత చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డిల ప్రభుత్వాల కంటే చాలా వేగంగా తెలుగును నిరుపయోగ భాషగా మార్చే ప్రక్రియను అమలు చేస్తోంది. అందులో మొదటి అంశం తెలుగు మాధ్యమంలో చదువులను రద్దుచేసి ఇంగ్లీషు మాధ్యమంలో మాత్రమే చదువులను నేర్పటానికి నిర్ణయించుకోవటం. పాలకులు అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ అవకతవకలకు పుట్టిన నిరుద్యోగానికి కారణం తెలుగు భాష అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అక్కడికి ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్న వారందరికీ ఉపాధి లభించేస్తున్నట్లు. 


ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజల అనుభవాలతో నిర్ధారణ అయినదేమంటే- ఏ పరాయి భాషనైనా మాతృభాషల ద్వారా సులువుగా వేగంగా నేర్చుకోగలుగుతారు అని. ఇది బోధనా మాధ్యమ శాస్త్రం అనుభవపూర్వకంగా చెబుతున్న సత్యం. ఈ సత్యాన్ని ఎంత నొక్కి వక్కాణించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్థం చేసుకునే విజ్ఞత లేకుండా పోయింది. ప్రభుత్వ నేతలను తెలివితక్కువ వారు అని అనకూడదు. తమ ప్రయోజనాల పట్ల ఎంతో తెలివితేటలుగా ప్రవర్తించే వారిని తెలివి తక్కువవారని ఎలా అనుకుంటాము? కనుక తెలుగుని భవిష్యత్ తరాలకు అవసరంలేని భాషగా మార్చడం వెనక వారికి చాలా పెద్ద అప్రకటిత ప్రయోజనాలు లేక స్వార్థ రాజకీయాలు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏవేవో తీవ్ర శక్తుల ఆదేశాలను పాటించడం ద్వారా లబ్ధిని పొందే అవకాశం ఏదో ఉందని అనుమానించాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషను సంస్కృత భాషతో కలిపి అకాడమీని నిర్మించ తలపెట్టటం సంస్కృతాన్ని బతికించడానికి కాదు తెలుగును కూడా వేగంగా మృతభాషగా మార్చటానికి మాత్రమే.


తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి తెలుగు సంస్కృతాలు పేకముక్కలు కలిసిపోయినట్లు కలిసిపోయాయని అన్నారు. మరి తెలుగు-సంస్కృత పదాలను కలిపి పదబంధాలుగా చేయకూడదని భాషా పండితులు ఎందుకన్నారో ఆవిడే చెప్పాలి. సంస్కృత భాషలో ఒక కంద పద్యాన్ని ఆవిడ చూపిస్తే తెలుసుకోవాలని ఉంది.


రాష్ట్ర అసెంబ్లీ ఆమోదంతోనే తెలుగు అకాడమీ పేరును మార్పు చేశామని ప్రకటించిన సందర్భంగా- ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో సంస్కృతం పాఠ్యాంశంగా ఇంటర్మీడియట్ చదువుకున్న సభ్యుల పేర్లను బహిరంగ పరచమని కోరుదాం. వారి ప్రసంగాలలో ఉల్లేఖనం కాని సొంత సంస్కృత వాక్యాన్ని ఒక్కటైనా చెప్పించమని అడుగుదాం. రాష్ట్ర ప్రభుత్వం అలా చేయించకపోతే మీడియా మిత్రులయినా అలా చెప్పించే ప్రయత్నం చేస్తే, ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాల సంస్కృత చదువుల బండారం బయట పడుతుంది.


ఫ్యూడల్ పాలకులే నయం, సంస్కృతాన్ని రాజస్థానాలకు, గ్రంథ రచనకు వినియోగించుకొని ప్రజల భాషలను వాటి మానాన వాటిని బ్రతుకనిచ్చారు. నేటి పరిపాలకులు సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు లొంగిపోయి, ఆ ఆదేశాల ప్రకారం, అరకొర ఇంగ్లీషు వచ్చిన కూలీల తయారీ కోసం తెలుగును అంతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. దీనిని తెలుగు భాషాభిమానులు, రచయితలు, కళాకారులు, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పరిశోధకులు, పాత్రికేయులు సంఘటితంగా అడ్డుకోవాలి.

దివికుమార్

జనసాహితి

Updated Date - 2021-07-22T08:34:05+05:30 IST