CM says sorry : కూతురు చేసిన తప్పుకి బహిరంగ క్షమాపణ చెప్పిన సీఎం

ABN , First Publish Date - 2022-08-22T01:54:20+05:30 IST

కూతురు చేసిన తప్పుకి మిజోరం(Mizoram) ముఖ్యమంత్రి జొరామ్‌తంగ (Zoramthanga) బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

CM says sorry : కూతురు చేసిన తప్పుకి బహిరంగ క్షమాపణ చెప్పిన సీఎం

ఐజ్వాల్ : కూతురు చేసిన తప్పుకి మిజోరం(Mizoram) ముఖ్యమంత్రి జొరామ్‌తంగ (Zoramthanga) బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అపాయింట్‌మెంట్‌ లేకుండా చూడనంటూ నిరాకరించిన వైద్యుడిపై జొరామ్‌తంగ కూతురు మిలారి ఛంగ్తే(Milari Chhangte) చేయిచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవ్వుతుండడంతో సీఎం జొరామ్‌తంగ దిగి రావాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


మిలారి ఛంగ్తే ఆగస్టు 17న ఐజ్వాల్‌లోని ఓ క్లినిక్‌లో చర్మవ్యాధుల(dermatologist) నిపుణుడిని సంప్రదించింది. కానీ అపాయింట్‌మెంట్ లేకుండా చూడబోనని వైద్యుడు తెగేసి చెప్పాడు. దీంతో మిలారి ఛంగ్తే ఆగ్రహంతో రెచ్చిపోయింది. వైద్యుడిపై దాడికి దిగింది. చెంపదెబ్బ కూడా కొట్టింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు, ప్రతిపక్షాల నేతలు పెద్ద ఎత్తున విమర్శల దాడికి దిగారు. వైద్యరంగ సిబ్బంది పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు కూడా వ్యక్తం చేశారు. మిజోరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) కూడా స్పందించింది. గత శనివారం ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది తమ విధుల సమయంలో నల్ల బ్యాడ్జ్‌లు ధరించి నిరసన తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి జొరామ్‌తంగ దిగొచ్చి క్షమాపణలు చెప్పారు.


కాగా వైద్యుడిపై దాడి ఘటనలో సీఎం జొరామ్‌తంగ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిలారి ఛంగ్తే దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయని ఆధారాలు చూపిస్తున్నాయి. తండ్రి క్షమాపణలు కూడా చెప్పినా.. ఆమెను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.



Updated Date - 2022-08-22T01:54:20+05:30 IST