ఎమ్మెల్యే అశోక్‌ గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2021-01-22T05:18:20+05:30 IST

కళావెంకటరావు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. ఆయనకు సంఘీభావం తెలియజేసేందుకు వెళ్తుండగా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను గురువారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కవిటి ఇన్‌చార్జి ఎస్‌ఐ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం రాత్రి 12 గంటల నుంచే ఎమ్మెల్యే అశోక్‌ ఇంటిని చుట్టుముట్టారు. గురువారం ఉదయం ఇంటి నుంచి ఆయనను బయటకు రానీయకుండా గేటు వద్ద ఏఎస్‌ఐ ఢిల్లీరావు, సిబ్బంది అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులతో ఎమ్మెల్యే అశోక్‌ వాగ్వాదం చేశారు.

ఎమ్మెల్యే అశోక్‌ గృహ నిర్బంధం
రామయ్యపుట్టుగలో ఎమ్మెల్యే అశోక్‌ను అడ్డుకుంటున్న పోలీసులు

కవిటి, జనవరి 21 : కళావెంకటరావు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. ఆయనకు సంఘీభావం తెలియజేసేందుకు వెళ్తుండగా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను గురువారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కవిటి ఇన్‌చార్జి ఎస్‌ఐ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం రాత్రి 12 గంటల నుంచే ఎమ్మెల్యే అశోక్‌ ఇంటిని చుట్టుముట్టారు.  గురువారం ఉదయం ఇంటి నుంచి ఆయనను బయటకు రానీయకుండా గేటు వద్ద ఏఎస్‌ఐ ఢిల్లీరావు, సిబ్బంది అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులతో ఎమ్మెల్యే అశోక్‌ వాగ్వాదం చేశారు. గృహ నిర్బంధం చేయాల్సిన అవసరమేమిటని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తమకు లేదా? అని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అరెస్టులతో పోరాటాలు ఆపలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల రామతీర్థం ఘటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పర్యటిస్తున్న సమయంలో ప్రజలను రెచ్చగొట్టేలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటించారని తెలిపారు. ఆయన వాహనంపై చెప్పులు, వాటర్‌ ప్యాకెట్లతో దాడిచేసిన వారిలో కళావెంకటరావు అనుచరులు ఉన్నారన్న నెపంతో ఆయన్ను అరెస్ట్‌ చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో ఆలయాల్లో జరిగిన 140 ఘటనల వెనుక ఎలుకలు, పిచ్చివారు ఉన్నారని డీజీపీ ప్రకటించారని గుర్తుచేశారు. ఈరోజు  టీడీపీ  నాయకులే ఆలయాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్‌ చేయాలనుకుంటే మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు గమనించాలని సూచించారు. టీడీపీ నాయకులపై దుర్బాషలాడిన వారికి పదవులు కట్టబెడుతున్నారని అశోక్‌ ఆరోపించారు. ఆలయాలపై దాడులకు కారకులను విడిచిపెట్టి టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నుంచి గ్రామస్థాయిలో వలంటీరు వరకు.. తొడలు కొట్టడం, దమ్ముంటే సెంటర్‌కు రా.. అని చాలెంజ్‌ చేస్తూ రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మచ్చలేని నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల కళా వెంకటరావును అరెస్ట్‌ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని పక్కన పెట్టి రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. శాసనసభ్యులు పోలీసుల పహరాలో అసెంబ్లీకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఎమ్మెల్యే అశోక్‌ విచారం వ్యక్తం చేశారు.


 అంబేడ్కర్‌కు విగ్రహానికి వినతిపత్రం 


 కళా వెంకటరావు అక్రమ అరెస్టు, ఎమ్మెల్యే అశోక్‌ గృహ నిర్బంధానికి నిరసనగా టీడీపీ నాయకులు కవిటి బస్టాండ్‌లో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యులు బి.రమేష్‌, పి.కృష్ణారావు, సీపాన వెంకటరమణ, బి.మణిచంద్ర ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-22T05:18:20+05:30 IST