వదలకుంటే ఖబడ్దార్!

ABN , First Publish Date - 2020-11-13T11:29:46+05:30 IST

కొండపల్లి అడవిలో కాసుల వేటకు తెగబడిన..

వదలకుంటే ఖబడ్దార్!

అక్రమ మైనింగ్ కేసులో ఎమ్మెల్యే బామ్మర్ది బెదిరింపులు

సీజ్ చేసిన వాహనాలు వదిలేయాలని అటవీ సిబ్బందిపై ఒత్తిడి

కొండపల్లిలో రూ.100కోట్ల అక్రమ మైనింగ్

ఆగస్టు 4న వాహనాలు సీజ్

సెప్టెంబర్ 3నే రిలీజింగ్ ఆర్డర్

వాహనాల విడవుదలకు కిందిస్థాయి సిబ్బంది ససేమిరా

ఆ ఉత్తర్వుల ఆధారంగానే ఒత్తిడి


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కొండపల్లి అడవిలో కాసుల వేటకు తెగబడిన అధికార పార్టీ ఎమ్మెల్యే బావమరిది.. అధికారులు సీజ్‌ చేసిన తమ వాహనాలను విడిపించుకునేందుకు సిబ్బందిపై బెదిరింపులకు దిగుతున్నాడు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఆగస్టు నెలలో అధికారులు సీజ్‌ చేసిన వాహనాలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే వేటు వేయిస్తానని అటవీ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నాడు. నాడు అక్రమార్కుల వాహనాలను సీజ్‌ చేసిన వెంటనే కేసు నమోదు చేసి, కోర్టు ముందు హాజరుపరచాల్సిన అధికారులు ఆ పని చేయలేదు. దీనిని ఆసరా చేసుకుని ఇప్పుడు ఈ వాహనాలను విడుదల చేయించుకునేందుకు ఆ ఘనుడు అటవీ సిబ్బందిపై బెదిరింపులకు దిగుతున్నాడు.


ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే బావమరిది. ఆ హోదాతో తన బావ నియోజకవర్గంలో ఎక్కడ కొండ కనిపిస్తే అక్కడ వాలిపోతాడు. పేదల స్థలాలను మెరక చేసే సాకుతో కొండలను తొలిచేస్తాడు. విజయవాడ రూరల్‌ మండలంలోని షాబాద గ్రామంలో మొదలైన ఆయన దందా కొండపల్లి రక్షిత అటవీప్రాంతం వరకు సాగింది. కొండపల్లి అడవుల్లో సుమారు రూ.100 కోట్ల అటవీ సంపదను ఈయన దోచేశాడన్న ఆరోపణలున్నాయి. ఈ దందాపై ఫిర్యాదులు వెల్లువెత్తడం, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో అటవీశాఖ అధికారులు ఆగస్టు 4వ తేదీన అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతంలో దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున వాహనాలను సీజ్‌ చేశారు. ఆ వాహనాల విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా.


ఈ వ్యవహారంలో నామమాత్రపు జరిమానాతో బయటపడిన ఎమ్మెల్యే బామ్మర్ది, వాహనాలను కూడా నామమాత్రపు జరిమానాతో విడుదల చేయించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ వాహనాలను విడుదల చేయాలంటూ గతంలో డీఎఫ్‌వోగా చేసిన మంగమ్మ సెప్టెంబరు మూడో తేదీన రిలీజింగ్‌ ఆర్డర్‌ ఇచ్చారు. భారీ మొత్తంలో అక్రమ మైనింగ్‌ జరిగినప్పుడు సీజ్‌ చేసిన వాహనాలను కోర్టుకు పెట్టిన తర్వాత కానీ విడుదల చేయరు. కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఆ అధికారిణి కేవలం రూ.10వేల పూచీకత్తుతో వాహనాలను తీసుకువెళ్లాలని ఉత్తర్వులు ఇవ్వడం అప్పట్లో పెనుదుమారం రేపింది. ఇప్పుడు అవే ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని తమ వాహనాలను విడుదల చేయాలని, లేకుంటే బదిలీ వేటు వేయిస్తానంటూ ఈ ఘనుడు అటవీ సిబ్బందిపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడు.


ఎందుకంత ఒత్తిడి?

సాధారణంగా ఏదైనా కేసులో వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేస్తే, కేసు ముగిసే వరకు వాహనాన్ని విడుదల చేయరు. అక్రమ మైనింగ్‌ కేసులో సీజ్‌ చేసిన వాహనాలే కీలకం. అందుకే వాహనాలను విడుదల చేయించుకోవడం ద్వారా కేసును నీరుగార్చవచ్చన్నది ఎమ్మెల్యే బామ్మర్ది ఆలోచన. కొండపల్లి అటవీప్రాంతంలో సుమారు రూ.100 కోట్ల అక్రమ మైనింగ్‌ జరిగి ఉంటుందని  విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. అటవీశాఖ అధికారులు మాత్రం అక్కడ కేవలం రూ.10కోట్ల లోపే అక్రమ తవ్వకాలు జరిగి ఉంటాయంటూ రూ.10 లక్షల జరిమానాతో సరిపెట్టేశారు. తర్వాత వాహనాలనూ వదిలేసేందుకు సిద్ధమయ్యారు. భారీగా అక్రమ మైనింగ్‌ చేస్తూ పట్టుబడిన వాహనాల విషయంలో ఇలా నామమాత్రం ష్యూరిటీతో వదిలేస్తే ఆ తర్వాత తాము బాధ్యత వహించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో వాటిని రిలీజ్‌ చేసేందుకు కింది స్థాయి సిబ్బంది ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో వారిని బెదిరించి వాహనాలను విడుదల చేయించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తన మాట వినకుంటే దూరప్రాంతాలకు బదిలీ చేయిస్తానంటూ వారిపై ఎమ్మెల్యే బామ్మర్ది ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో మూకుమ్మడి సెలవులు పెట్టి నిరసన తెలిపేందుకు అటవీశాఖ సిబ్బంది సిద్ధమవుతున్నారు. 


డీఎఫ్‌వోపై బదిలీ వేటు

కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారంలో జిల్లా అటవీశాఖ అధికారి మంగమ్మపై ఆరోపణలు రావడంతో బదిలీ చేసింది. ఈ వ్యవహారంలో కీలక అధికారులపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి సిబ్బందిని ఆరుగురిని సస్పెండ్ చేయడంపై అప్పట్లోనే డీఎఫ్‌వోపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత సీజ్ చేసిన వాహనాల విడుదలకు సైతం అడ్డగోలు ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదమైంది. వాస్తవానికి ప్రభుత్వ సంపదను భారీగా కొల్లగొడుతున్న అక్రమార్కుల వాహనాలను సీజ్ చేసిన వెంటనే కేసు నమోదు చేసి, కోర్టు ముందు హాజరుపరచాలి. కానీ కొండపల్లిలో పట్టుబడిన వాహనాల విషయంలో ఈ నియమాన్ని అటవీశాఖ అధికారులు తుంగలో తొక్కారు. ఒకసారి కోర్టు ముందుకు వెళితే ఆ కేసు తేలేవరకు వాహనాలను విడుదల చేసే అవకాశం ఉండదు. అందుకే అటవీశాఖ అధికారులు ఈ కేసును కోర్టు ముందుకు తీసుకురాలేదనే ఆరోపణలున్నాయి. మొత్తం మీద కొండపల్లి అక్రమ మైనింగ్ వ్యవహారమే డీఎఫ్‌వోపై వేటుకు కారణమైంది.

Updated Date - 2020-11-13T11:29:46+05:30 IST