15 రోజులు వేచి చూస్తా

ABN , First Publish Date - 2022-02-21T08:26:26+05:30 IST

తొందరపాటు తనంతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయవద్దంటూ పార్టీ సీనియర్లు తనకు సూచించారని, ఆ మేరకు తన రాజీనామాను 15 రోజులపాటు వాయిదా వేసుకుంటున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు,..

15 రోజులు వేచి చూస్తా

  • అధిష్ఠానం అపాయింట్‌మెంట్‌ దొరికితేనే ఢిల్లీకి  
  • నా ఆవేదనంతా సోనియా, రాహుల్‌కే చెబుతా
  • పోతేపోనీ అంటూ గాంధీభవన్‌లో ఒకరిద్దరన్నారు
  • లొల్లెందుకు? బయటికి పంపమనే చెబుతున్న
  • బీజేపీ ముద్ర నుంచి బయటపడే పనిలో సీఎం
  • అందుకే ముంబై టూర్‌..యూపీఏను చీల్చడం 
  • అయ్యే పని కాదు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి


హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తొందరపాటు తనంతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయవద్దంటూ పార్టీ సీనియర్లు తనకు సూచించారని, ఆ మేరకు తన రాజీనామాను 15 రోజులపాటు వాయిదా వేసుకుంటున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్‌ దొరికితేనే తాను ఢిల్లీకి పోతానని స్పష్టం చేశారు. అధిష్ఠానం అపాయింట్‌మెంట్‌ను సీనియర్లు ఇప్పిస్తే తన ఆవేదననంతా సోనియా, రాహుల్‌కే చెబుతానని పేర్కొన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌ల దగ్గర తన సమస్యకు పూర్తి పరిష్కారం దొరకదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ మీడియా హాల్లో ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ‘జగారెడ్డి పార్టీ నుంచి పోతే పోనీ’ అంటూ గాంధీభవన్‌లో ఒకరిద్దరు కామెంట్లు చేశారని తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. తెలిసిందన్నారు.


సిల్లీగా మాట్లాడే అనుచరులు ఉంటే ఇలాగే ఉంటుందని పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  ‘‘హర్కార వేణుగోపాల్‌కు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇంత రాద్దాంతం జరుగుతుంటే గాంధీభవన్‌లో కూర్చుని ఇలాంటి కామెంట్లు చేయడం ఎందుకు? మా లాంటి వారికి ఎలా అనిపిస్తుంది? నాతో లొల్లి ఎందుకు? అందుకే బయటికి పంపండి అంటున్న’’ అని జగ్గారెడ్డి  వ్యాఖ్యానించారు. ఏడీఎంకే అధినేత్రి జయలలిత మరణించినప్పుడు..  తాను జయలలిత ఓటమి కోరుకున్నానే కానీ.. ఆమె మరణాన్ని కాదు అంటూ డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలూ కరుణానిధి చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకోవాలని సూచించారు. జగ్గారెడ్డి ఎందుకు రోడ్డు ఎక్కాడన్నదానికి ఠాగూరే సమాధానం చెప్పాలని ఓ ప్రశ్నకు సమాధానంగా  పేర్కొన్నారు. కొత్త పార్టీ పెడతారన్న వ్యాఖ్యలపైన స్పందిస్తూ తెలంగాణలో ఆ స్పేస్‌ ఉందన్నారు. టీఆర్‌ఎ్‌సలో చేరాలి అనుకుంటే సింగిల్‌ ఫోన్‌ చాలు కదా? అని వ్యాఖ్యానించారు. సింగిల్‌ అంటే తనకు ఇష్టమని, తన ఆట చూపిస్తానని అన్నారు.   జగ్గారెడ్డి వివాదం టీ కప్పులో తుపాను లాంటిదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆ మాటల్లో తప్పు లేదని, కానీ పంచాయితీకి మూలాన్ని ఆయన వెతకడం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీపైన, పార్టీ నాయకత్వంపైన తనకు ఎలాంటి కోపం లేదన్నారు. 


యూపీఏ కూటమిని చీల్చడం కేసీఆర్‌ వల్ల కాదు

యూపీఏ కూటమిని చీల్చడం సీఎం కేసీఆర్‌ వల్ల అయ్యే పని కాదని జగ్గారెడ్డి అన్నారు. ఆయనపై ఉన్న బీజేపీ ముద్రను పోగొట్టుకునేందుకే యూపీఏ అనుబంధ పార్టీలను కలుస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో నేరుగా కొట్లాడుతున్నది తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ సీఎంలు స్టాలిన్‌, మమతా బెనర్జీలేనన్నారు. కేసీఆర్‌.. బీజేపీ మనిషంటూ రైతు ఉద్యమకారుడు తికాయత్‌ కూడా అన్నారని గుర్తు చేశారు. తాను బీజేపీ మనిషినన్న ముద్ర నుంచి  బయటపడేందుకే మహారాష్ట్ర సీఎంను కలవడం కోసం కేసీఆర్‌ ముంబయి పర్యటన పెట్టుకున్నారన్నారు. మహారాష్ట్ర సీఎం.. కాంగ్రెస్‌ పార్టీతోనే కలిసి ఉన్నారని గుర్తు చేశారు. 


ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు

జగ్గారెడ్డి అంటే నాకు అభిమానం : హర్కార వేణుగోపాల్‌ 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, డిజిటల్‌ సభ్యత్వ చీఫ్‌ కో ఆర్డినేటర్‌ హర్కార వేణుగోపాల్‌ అన్నారు. తాను పార్టీని వీడినా ఏమీ కాదంటూ హర్కార వేణుగోపాల్‌ కామెంట్‌ చేసినట్లుగా తెలిసిందంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఈ మేరకు ఆయన వివరణ ఇచ్చారు. తాను ఆయనపై తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లు తప్పుడు సమాచారం అందడం వల్లే జగ్గారెడ్డి అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నానని పేర్కొన్నారు. జగ్గారెడ్డి అంటే తనకు ఎంతో గౌరవం, అభిమానమని, పార్టీలోకి కొత్తవారు రావాలని కోరుకుంటామే తప్ప ఉన్న నేతలు బయటికి వెళ్లాలని ఎప్పుడూ కోరుకోమని చెప్పారు. అలాంటిది ఒక ప్రజాబలం కలిగిన నేత, ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి పార్టీని వీడాలని ఎవరూ కోరుకోరన్నారు. ప్రజా బలం కలిగిన జగ్గారెడ్డి లాంటి వారి సేవలు పార్టీకి ఎల్ల కాలం అవసరమన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2022-02-21T08:26:26+05:30 IST