సమావేశం నుంచి బయటకు వెళ్లిపోతున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
సభ నుంచి బయటకు
బుజ్జగింపుల అనంతరం తిరిగి సభలోకి
సత్యవేడు, మే 25: సమస్యలు తన దృష్టికి తీసుకురాకపోవడమే గాకుండా ఏకంగా సభలో లేవనెత్తడంపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అలకబూనారు. ఏకంగా మండల సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సంఘటన బుధవారం సత్యవేడు మండల సమావేశంలో జరిగింది. సత్యవేడు మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ప్రతిమ ఆధ్వర్యంలో జరిగింది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, తిరుపతి ఎంపీ గురుమూర్తి హాజరయ్యారు. రెవెన్యూశాఖపై జరిగిన సమీక్షలో అధికార పార్టీకి చెందిన చెరివి ఎంపీటీసీ రామయ్య మాట్లాడుతూ శ్రీసిటీ పరిధిలోని పంచాయతీల్లో భూ సమస్యలను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. తెప్పగుంటలో పూడిక తీత పనులు చేసేందుకు వెళ్లిన ఐదుగురు ఉపాధి కూలీలపై కేసులు నమోదయ్యాయని దీనికి ఉపాధి ఏపీవో భాస్కరయ్య నిర్లక్ష్య వైఖరే కారణమని ఆరోపించారు. 15 సంవత్సరాలుగా ఏపీవో ఇక్కడే తిష్టవేశారని ఎందుకు బదిలీ కాలేదని ఇందులో ఆంతర్యమేమిటని నిలదీశారు. ఎమ్మెల్యే ఆదిమూలం సర్దిచెప్పినా వినకపోవగా మరింత బిగ్గరగా మాట్లాడారు. ఎంపీపీ ప్రతిమ, పలువురు సభ్యులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఎమ్మెల్యే అసహనంతో ఒక్కసారిగా వేదిక దిగేశారు. రామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఎంపీ గురుమూర్తి సూచనలతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎమ్మెల్యేను బుజ్జగించి మళ్లీ సభలోకి తీసుకొచ్చారు.