MLA రాజాసింగ్ VS పోలీస్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!

ABN , First Publish Date - 2022-02-03T15:36:32+05:30 IST

పోలీసులకు, ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలైందా..

MLA రాజాసింగ్ VS పోలీస్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!

  • ధూల్‌పేట గంజాయిపై స్పెషల్‌ ఫోకస్‌
  • అడ్డుకట్ట వేస్తున్న ఖాకీలు
  • అనుచర గణానికి అండగా ఎమ్మెల్యే
  • ఠాణా ఎదుట ఆందోళన

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : పోలీసులకు, ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలైందా అంటే ప్రస్తుత ఘటనలు అవుననే అంటున్నాయి. ప్రభుత్వం సూచనతో పోలీసులు గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంటే, ధూల్‌పేట్‌లో జాగ్రత్తగా ఉండాలంటూ ఎమ్మెల్యే.. పోలీసులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం గంజాయిని రూపు మాపేందుకు ప్రత్యేక చర్య లు చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ధూల్‌పేట్‌ నుంచే గంజాయి అన్ని ప్రాంతాలకు సరఫరా జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఎక్సైజ్‌ పోలీసులు, మంగళ్‌హాట్‌ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి నిందితులపై రెండు మూడు నెలల్లోనే పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు.


ఇటీవల మంగళ్‌హాట్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రవి 11మంది గంజాయి అమ్మకందారులపై పీడీ యాక్ట్‌ పెట్టి, జైలుకు పంపించారు. గత సంవత్సరం మొత్తం 50 మంది పీడీ యాక్ట్‌లో జైలుకు వెళ్లారంటే ఇక్కడి పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రాంతంలో అర్ధరాత్రి వరకు రోడ్లపై కూర్చొని బాత్‌ఖానీ కొడుతూ పెట్రోలింగ్‌ నిర్వహించే పోలీస్‌ సిబ్బంది కనిపించినా తమనేమీ చేయలేరులే అనే విధంగా వ్యవహరించే వారిపట్ల పోలీసులు అధికారులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కేసులు ఉన్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఐదుగురు ఓ ఇంటి వద్ద అరుగులపై కూర్చొని మంతనాలు కొడుతూ అనుమానాస్పదంగా కనిపించారు. అందులో రవీందర్‌ సింగ్‌పై ఇప్పటికే రెండు సట్టా కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతన్ని చూడగానే ఇంట్లోకి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. దీంతో పాటు ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకునే మరో వ్యక్తిపై కూడా కేసులు ఉన్నాయి. ఇటీవల అతడికీ హెచ్చరికలు జారీ చేశారు.


వీడియో వైరల్‌..

మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన అనుచరులతో కలిసి మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకొని ఇన్‌స్పెక్టర్‌ రవితో వాగ్వాదానికి దిగారు. ధూల్‌పేట్‌లో ప్రేమగా ఉంటే మంచిది లేదా ధూల్‌పేట్‌ ఎలాంటిదో మీకు తెలుస్తుంది అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్లు ఓ వీడియో వైరల్‌ అవుతోంది. సీఎం కేసీఆర్‌ గుడుంబా తయారీ దారులను రోడ్డుపైకి తీసుకొచ్చారంటూ అందులో పోలీసులపై చిందులు వేశారు. సట్టా, క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులు ఉన్న ఇద్దరి కోసం ఎమ్మెల్యే మంగళ్‌హాట్‌ ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడినట్లు ఉన్న వీడి యో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదే విషయమైన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను వివరణ కోరేందుకు పలు మార్లు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.


సట్టా, గంజాయిపై ఉక్కుపాదం

సట్టా నిర్వాహకులు, గంజాయి అమ్మకందారులపై కఠినచర్యలు తీసుకుంటున్నాం. అర్ధరాత్రి 2.30 గంటల వరకు రోడ్లపై కూర్చొని ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఇటీవల అర్ధరాత్రి ఇళ్ల ముందు కూర్చున్న వారిని పోలీసులు మందలించారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ పోలీస్‌స్టేషన్‌ ముందుకు వచ్చి ప్రశ్నించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పొడే వారిపై తప్పని సరిగా చర్యలు తీసుకుంటామని చెప్పాం. - ఎన్‌.రవి, ఇన్‌స్పెక్టర్‌, మంగళ్‌హాట్‌.

Updated Date - 2022-02-03T15:36:32+05:30 IST