ఎమ్మెల్యే రాజాసింగ్‌ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలి : గజ్జెల కాంతం

ABN , First Publish Date - 2021-03-06T07:23:22+05:30 IST

అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, తెలంగాణ అంబేడ్కర్‌ యువజన సంఘం చైర్మన్‌ గజ్జెల కాంతం అన్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలి : గజ్జెల కాంతం
సమావేశంలో మాట్లాడుతున్న గజ్జెల కాంతం

పంజాగుట్ట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, తెలంగాణ అంబేడ్కర్‌ యువజన సంఘం చైర్మన్‌ గజ్జెల కాంతం అన్నారు. శుక్రవారం జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో వివిధ అంశాలను చర్చించారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనిలో భాగంగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని చూస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడిన మాటలు ఆయన స్థాయికి తగినవి కావనన్నారు. గో మాంసం తినొద్దని రాజ్యాంగంలో రాసి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఆర్‌ఎ్‌సఎస్‌ రాయలేదని, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాశారన్నారు. 

ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బహిష్కరించాలని, దేశద్రోహం, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌, డీజీపీలను ఆయన డిమాండ్‌ చేశారు. వామన్‌రావు, నాగమణి దారుణ హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని, దోషులు ఎంతటి వారైనా వారిని వదిలి పెట్టొద్దన్నారు. నారాయణపేట పోలీస్‌స్టేషన్లో అమాయక దళిత బాలికను అక్రమంగా  నిర్బంధించిన ఘటనపై కూడా విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో జేఏసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు కొమ్ము తిరుపతి, సురేందర్‌ సన్నీ, ప్రధాన కార్యదర్శి నరసయ్య, నాయకులు నర్సింగరావు, వెంకటేష్‌, రఘు, రమేష్‌, భీం ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు సుజీత్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-06T07:23:22+05:30 IST