అత్యాచారాలకు అడ్డాగా తెలంగాణ గడ్డ: రాజాసింగ్‌

ABN , First Publish Date - 2021-09-17T16:49:35+05:30 IST

తెలంగాణ గడ్డ రేప్‌లకు అడ్డాగా మారిందని ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్ర

అత్యాచారాలకు అడ్డాగా తెలంగాణ గడ్డ: రాజాసింగ్‌

హైదరాబాద్/మంగళ్‌హాట్‌: తెలంగాణ గడ్డ రేప్‌లకు అడ్డాగా మారిందని ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, ఎంఐఎం పార్టీలపై గురువారం ఆయన విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉందని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. సింగరేణి కాలనీలో చిన్న పాపను రేప్‌ చేసిన వారిని కూడా పట్టుకోలేకపోయారని, నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడా...? లేదా...? అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. సింగరేణి ఘటన మరవక ముందే తాజాగా హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బాలికపై అత్యాచార యత్నం జరిగిందన్నారు. ప్రజలను కాపాడాల్సిన డీజీపీ, కమిషనర్‌లు ఇతర పనుల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో చాలా యేళ్లుగా వినాయకుడికి పూజలు చేసి వినాయక్‌ సాగర్‌(ట్యాంక్‌బాండ్‌)లో నిమజ్జనం చేయడం అనవాయితీగా వస్తోందని ఆయన గుర్తు చేశారు. వినాయక్‌ సాగర్‌లో ఉన్నవి మంచినీరు కాదని, పరిసర ప్రాంతాలలోని మురికి నీరంతా అందులో చేరుతుందని, ఇదే విషయాన్ని హైకోర్టుకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  నిమజ్జనం విషయంలో హైకోర్టు తీర్పు రాగానే ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

Updated Date - 2021-09-17T16:49:35+05:30 IST